పుట:Andrulasangikach025988mbp.pdf/351

ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత నాలుగు తావుల ముళ్ళు వేయసాగిరి. కాని బారాబందీ పదమట్లే నిలచెను. జనసామాన్యము మోటు దుప్పటి మాత్రమే కప్పుకొనుచుండెను. పురులకు చెవులకు పోగులుండుట సర్వసాధారణము. అందులో థనికులగువారు చెవుల పై భాగములో కూడ ముత్యాలతో లేక రత్నాలతో కూడిన పోగులను ధరించువారు. చాలామంది దండకండెములను ధరించెడివారు వేమన పలుమారు లిట్లు వ్రాసియున్నాడు.

            తలను పాగ, పైని తగు పచ్చడము, బొజ్జ,
            చెవులపోగు లరసి చేరు నర్థి
            శుద్ధ మూర్ఖులనుచు బుద్ధిలో నరయక ॥
విశ్వ॥


            పాగ, పచ్చడంబు పైకి కూసంబును.
            పోగు లుంగరములు బొజ్జకడుపు
            కలిగినట్టివాని కందురు చుట్టాలు ॥
విశ్వ॥

వేమన కాలములోని కొన్ని సాంఘిక జీవిత విశేషములు ఆతని పద్యాల వల్ల స్పురిస్తున్నవి.

'గజపతింట నెన్న గవ్వలు చెల్లవా' అన్నాడు, గవ్వలుకూడా నాణెముగా నుండెను. 'గవ్వ సేయనివాడు' అని పరమ నీచుని తిట్టుటకే తెనుగులో సామెత యయ్యెను.

           "ఆశచేత దనము నార్జింపగానేల
            మట్టి క్రిందబెట్టి మరువనేల"

ఇనుప పెట్టెలు బ్యాంకులు లేని కాలములో భూమిలోనే ధనము పాతి పెట్టెడి ఆచారముండెను.

           'ఊసరిల్లి పిచ్చి యుపమున రసమున
            చేర్చి నూరి సతులు చెలువముగను
            వశ్యమగును మగని వరియించి పెట్టంగ
            రోగ మమరి నీల్గు రూడి వేమ'

నేటికిని "మరులుమందు"ను ఒల్లని భర్తలకు భార్యలు కొందరు పెట్టుటయు, ఆ మందుతో ఆ భర్తలు చచ్చుటయు వింటున్నాము. (కాని పై పద్యము వేమనది కాదని శైలియే తెలుపుచున్నది.)