పుట:Andrulasangikach025988mbp.pdf/342

ఈ పుట ఆమోదించబడ్డది

వారి దానుష్కుల చతురతను గుర్తుంచుకొని తమ సైన్యములో ముసల్మానులనే భర్తీ చేసుకొనెను. వారి నాకర్షించుటకై వారికి మసీదులు కట్టించి వారు కోరిన వరాలను ఇచ్చెను. 'కాని లాభము లేకపోయెను. తుదకు దేవరాయలు సంధిచేసుకొని బహమనీ సుల్తానులకు కప్పము కట్టెను.' (స్మిత్ Oxford History of India P. 303)

తళ్ళికోట లేక రక్షసతగడీ యుద్ధము క్రీ.శ. 1565 లో జరిగెను. దాని తర్వాత ఆంధ్రదేశమ లో రాజకీయ దౌర్బల్య మేర్పడుచు వచ్చెను. కొంత కాలము పెనుగొండలో ఆంధ్రరాజులు నిల దొక్కు కొనిరి. కాని అక్కడి నుండి పీఠము చంద్రగిరికి కదలగానే ఆంధ్రుల రాజకీయౌన్నత్యము పరిసమాప్తి అయ్యె నన్నమాట. క్రీ.శ. 1600 వరకు ఆంధ్రదేశములో ఒక గోలకొండ సుల్తానులు తప్ప తక్కిన తురక లెవ్వరును రాజ్యము చేయలేదు. గోలకొండ సుల్తానులు షియ్యాలగుట చేతను వారియాధిక్య మిప్పటి తెలంగాణములో వలెనే యుండినందునను వారికి ప్రక్కననే ప్రబల విజయనగర చక్రచర్తు లుండుటచేతను వా రాంధ్రులను దుష్టముగా పాలించినవారు కారు. కాని తళ్ళికోట యనంతరము తెనుగుదేశములో తురకల విజృంభణము ఎక్కువయ్యెను. అంతవరకు కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, రెడ్డిరాజులు తురకలను నిరోధించుచు వారిని తెనుగు సీమలోనికి రానీయనందున ఆంధ్రులకు ఉత్తర హిందూస్థాన హిందువులకు కలిగిన కష్టాలెట్టివో కానరాకుండెను. తటాలున క్రీ.శ. 1600 తర్వాత 150 ఏండ్లవరకు తురకల దాడు లెక్కువై కర్నూలు, కడప, గుంటూరు నవాబు లేర్పడి ఉత్తర సర్కారులు వారి వశమై వారి దుష్పరిపాలన మొకదిక్కు సాగుచుండగా, మరొకదిక్కు పిండారీలు, దోపిడిగాండ్లు, తురకల దండులు ఎక్కువై జనుల హింసించి చంపి దోచి చెరచి, గుళ్ళను కూలద్రోసి నానా ఘోరాలు చేయగా ఆంధ్రులు హాహాకారాలు చేసి చాలా బాధపడిరి. ఆ బాధలు పద్యాలలోను, కావ్యాలలోను, ప్రబంధాలలోను, చాటువులలోను ప్రతిఫలించినవి. గోగులపాటి కూర్మనాథుడను కవి విశాఖపట్టణ మండలములో తురకలదండు ప్రవేశించి బీభత్సములు చేయగా సింహాద్రి నారసింహస్వామినే నానావిధాల తిట్టుచు సింహాద్రి నారసింహ శతకమును వ్రాసెను. ఆ కవి క్రీ.శ. 1700-1750 ప్రాంతమువాడు. తురకదండు పొట్నూరు, భీమసింగి, జామి, చోడవరం మున్నగు ప్రాంతాలలో దూరి దోచుకొని దేవాల