పుట:Andrulasangikach025988mbp.pdf/308

ఈ పుట ఆమోదించబడ్డది

కరములో వ్రాసినారు. ఇది తప్పు. విక్రమోర్వశీయములో (తృతీయాంకములో)" అహమపి యదా శిఖరిణీ రసాలంచ న లభేతదైతత్ ప్రార్థయమాన: సంకీర్త యన్నాశ్వసిమి" (నాకు శిఖరిణియు తియ్యమామిడియు దొరక నప్పుడు వాటిని మెచ్చి కోరిక వెలిబుచ్చి ఆనందింతును.) అని తిండిపోతు విదూషకు డంటాడు. దానిపై రంగనాథుడను పండితు డిట్లు వ్యాఖ్యానించెను. "ఏలాలవంగ కర్పూరాది సురభిద్రవ్య మిశ్రితం దుగ్దేన సహ గాలితం సితాసంగతం దధిశిఖరిణీ త్యుచ్యతే దధ్యతిరిక్త పూర్వోక్త ద్రవ్య మిశ్రిత: పక్వకదళీ ఫలాంతస్పారోపి తత్పదవాచ్య:" అనగా ఏలకిపొడి లవంగముపొడి పచ్చకర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు పాలలో కలిపి వస్త్రగాలితంచేసి తెల్లని చక్కెర కలిపిన పెరుగు కలిపితే అది శిఖరిణి యనబడును. లేక పెరుగుకు మారుగా అరటిపండ్ల ముక్కలు కలిపితే శిఖరిణి యగును. భారత దేశమందు వివిధ ప్రాంతములందు వివిధాచారము లీ శిఖరిణిలో కానవస్తున్నవి. మహారాష్ట్రులు పెరుగును బట్టలోకట్టి నీరేమియు లేకుండా ఒత్తి ఒక పాత్రకు బట్టకట్టి దానిపై ఏలకి, లవంగము, జాజికాయ, జాపత్రి పొడియు, కుంకుమపువ్వును వడియగట్టిన పెరుగును చక్కెరను వేసి కలిపి రుద్దుదురు. ఆ విధముగా వస్త్రగాలితమగు దాన్ని శిఖారిణి యందురు. రాయలసీమ ప్రాంతాలలో ఏలకి లవంగ జాజిపొడిని చక్కెరను మామిడిపండ్ల రసములో కలిపిన దానిని శిఖరిణి యందురు. వాల్మీకి రామాయణములో (అయోద్య 91-73) 'రసాలస్యదధ్న:' అని భరద్వాజుడు రాముని కిచ్చిన విందుపట్టికలో చేర్చినారు. దానిపై వ్యాఖ్యాతలు "శుంఠి పిప్పలి మిరియాలు ఏలకులు లవంగాలు తక్కోలము శర్కర అల్లము జీలకర్ర వేసి తాళింపుచేసిన పెరుగు" అని వ్రాసినారు. అదియు శిఖరిణియై యుండునా? పాండురంగ మాహాత్మ్యములో ఒలుపు పప్పులు కజాయములు ద్రబ్బెడలు ఒర్రచేపలు సగరులు మున్నగునవి కలవు. అంబళ్ళు అని విందుల పట్టికలో ఆముక్తమాల్యదలో, సాంబోపాఖ్యానములో, పాండురంగ మాహాత్మ్యములో ఇచ్చినారు తైదంబలి, జొన్నంబలి కాదు. పరమాన్నమువంటి చోప్యములని యర్థము.

వైష్ణవాదిస్వాములు చందనపు పావలు ధరించిరి. (విప్రనారాయణ చరిత్ర) రాజులు "పలుచని దంతపుందళుకు పాదుకలు" ధరించిరి. [1] కోమట్లలో

  1. శుక 1-3, 70.