పుట:Andrulasangikach025988mbp.pdf/270

ఈ పుట ఆమోదించబడ్డది

పంచాయతీ సభలు

ఆ కాలమందు కోర్టులు లేకుండెను. ప్రతిగ్రామమందు గ్రామపెద్దలు ప్రతిఫలాపేక్ష లేక తగవులు తీర్పుచేసిరి. విజ్ఞానేశ్వరీయమే ముఖ్యాధార భూతశాస్త్రము. బ్రాహ్మణులే సభాసదులు. వారి తీర్పులపై రాజువద్ద పునర్విమర్శ(అపీలు) కావచ్చును. సాధారణముగా వారి తీర్పునకు తిరుగు లేకుండెను. ధనోద్బవ (సివిల్), హింసోద్బవ (క్రిమినల్) అభియోగములను (కేసులను) వారే విచారించిరి. ముఖ్యమైన నేరములను రాజు స్వయముగా విచారించెనను. 'సభ'వారిని పిలిచి వారి సహాయముతో తీర్పు చెప్పెడివారు.

"సభ"ను చావడిలోనో, దేవాలయమందో, ఊరిమధ్య నుండు "రచ్చ" కట్టపైననో చేసిరి. అందుచేత వివాదమునకు సభగా కూడుటకును "రచ్చ" యనిరి.[1] రాజు స్వయముగా విచారించినప్పుడు,

        "తీర్పరిం బిలిచి చేతికి నిచ్చి కనలి యీ చోరునకు నాజ్ఞయేది శాస్త్రంబు
         చూచి సేయింపు డచ్చుగ మీ రటంచు
         తెలియ విద్వాంసుల దిక్కు వీక్షించి" పలికె [2]

ఒకతడవ ఒక వైష్ణవునికి, జైనులకు ఇయ్యవలసిన పత్రము పైకముపై వివాద మయ్యెను. అప్పుడు,

        "ఘనుల గొందర సభగా గూడబెట్టి తనవారిపనులు చందము జెప్పి
         కొన్ని దినములు గడువిడి తేటతెల్లముగ సమ మాస తిథి వార సరణు
         లేర్పరచి అమర జైనుల కిచ్చినట్టి పత్రంబు క్రమ మెట్టిదనిన........"

సభ వారియెదుట ఉభయులును తమతమ వాదాలు వినిపించిరి. సభవారు సాక్షు లెవరని విచారించిరి.

         "....మా కిచ్చిన పత్ర మదె సాక్షులున్నార లౌ గాములకు"
         "అనిన వారాపత్ర మాసాక్షి వారు వినుచుండ వడి చదివింప" [3]

         సభవారు విని తీర్పు చెప్పిరి.

  1. ఆము. 4-111.
  2. పరమయోగివిలాసము, పుట 340.
  3. పరమయోగివిలాసము, పుట 340.