పుట:Andrulasangikach025988mbp.pdf/251

ఈ పుట ఆమోదించబడ్డది

పరిపాలనకై దేశమును 200 మండలాలుగా విభజించి యుండిరి. ప్రతిమండల మొక పాలెగారు అధీనమం దుండెను. వారు నిర్ణయమగు పన్నును చెల్లించుటకును నియమిత సైన్యముతో సిద్ధముగా నుండి ఆజ్ఞయైనప్పు డంతయు ఆ సైన్యముతో రాజసేవలోకి వెళ్ళుటకు బాధ్యులై యుండిరి.

పూటకూళ్లు పెట్టి జీవించు నాచారము మనకు కాకతీయుల కాలమునుండియు కానవస్తున్నది. పూటకూళ్ళలో "ఆహారవిహారములు" దొరకుచుండెనని క్రీడాభిరామమందు వర్ణింపబడెను. విజయనగరమందు పూటకూళ్ళు సమృద్ధిగా నుండెను.[1] పూటకూలివారు ద్రవ్య మార్జించువారు కాన కల్తీ భోజనము పెట్టి, పాసిన వంటకాలు ఉడుకువాటిలో కలిపి వాసన నెయ్యిని తెచ్చి, మజ్జిగలో నీరెక్కువగా పోసి, ఇట్టి దుష్ట చర్యలను చేసెడివారు. "పూటకూళ్ళది పుణ్యమునకు జొరదు!" అనుటచే స్త్రీలే అందును బహుశా వితంతువులే. వారును బ్రాహ్మణులే యీవృత్తిపై జీవించువారు. "అక్కవాడల నరకూళ్ళు మెక్కి"[2] అనుటలో వీధులలోనికి పోయి అక్కా అమ్మా అని స్త్రీలను మంచివారి చేసుకొని సగము గడుపున కన్నము తిని-అని వేదమువారు వ్యాఖ్యానించినారు. కాని పూటకూళ్ళ అక్కలవద్ద హితవుకాని యన్నము లభించుటచేత సగము గడుపునకే తిని-అని యర్థమగును. క్రీడాభిరామమందు కూడ పూటకూటింటికి పోవునప్పుడు అక్కలవాడకు పోదమన్నారు. 'వంటలక్క' అని నేటికిని పూట కూళ్ళయామె నందురు.

నగరాలలో క్షౌరశాలలుండెను. అవి విజయనగరములో సమృద్ధిగా నుండెను.

          "కూర్చుంబు గొరిగించుకొని యుష్టతోయంపు
           టంగడీ తలగడుగు" [3]

క్షౌరశాలలేకాక తలంటి అంగమర్దనము చేసి ఉడుకునీళ్ళతో నలుగుతో స్నానము చేయించి పైకము తీసుకొను అంగళ్ళుకూడా నెగడి యుండెను.

  1. ఆము. 7-7.
  2. ఆము. 7-5.
  3. ఆము. 7-7.