పుట:Andrulasangikach025988mbp.pdf/239

ఈ పుట ఆమోదించబడ్డది

ధనికులు, అధికారులు, కవులు, పండితులు, రెడ్లు మున్నగువారు పల్లకీలలో వెళ్ళుతూ వుండిరి. పల్లకీలను బోయీలు (బెస్తలు) మోసెడివారు. పల్నాటి యుద్ధములో పల్లకీ బోయీల ముచ్చట కలదు. అనగా క్రీ.శ. 1150 నుండి ఈనాటి మన కాలమువరకు గూడా బోయీలు తమ వృత్తిని వదులుకొన్న వారు కారు. కవి పండితసభలను రాజు కావించినప్పుడు వారు బయట వదలి వెళ్ళు పాదరక్షలను కాపాడుటకై సేవకులు నియుక్తులై యుండిరి.[1]

సాత్తని, సాత్తిన అని వైష్ణవార్చకులలో రెండు శాఖ లుండెను. సాత్తినవారు నెత్తి గుండుగా గొరగక జందెము వేసుకొన్నవారు. సాత్తనివారు నెత్తి బోడిగా గొరిగించి జందెములేక యుండువారు. (ఆముక్తమాల్యద, 2 - 97) సాత్తనివారి వేష మెట్టిదనగా:-

         "పొంకపు పట్టెనామములు పొల్పగు మేల్ తిరుచూర్ణ రేఖలున్
          చంకల తాళికాదళ విసారిత పేటికలన్ భుజంబులన్
          సంకును చక్రముల్ గలుగు సాత్తనివారు...."[2]

వెలివాడలో మాదిగవారు చెప్పులు కుట్టి వాటిని తంగడాకుతో మెత్తచేసి యిచ్చెడివారు.

విజయనగరములో బోగపుసానుల సంఖ్య అపారముగా నుండెను. వారిపై గణాచారి గుత్తాపన్ను వసూలుచేసిరి. నగరముననుండు 12000 రక్షకభటుల జీతాలు బోగమువారి పన్నులతో సరిపోయెడిది. రాచవారు, ధనికులు, ఉంపుడుగత్తెల నుంచుకొనుటయు, అ ముచ్చటను ప్రకటించు కొనుటయు మగతనపు లక్షణముగా భావించిరి. మంచిమంచి మంత్రులు, పాళెగాండ్రు, రాజులు కవులచేత అట్టి రసికతను వర్ణింప జేసుకొనిరి. సింగమనాయుడు తన బోగముదాని ముచ్చటను భోగినిదండకముగా రచింపచేసెను. సంపన్నులు తమ యుంపుడు కత్తెలను బోగం వారిని ఉత్సవాలలో వెంట తీసుకొనిపోయి జనులు చూచునట్లుగా వారితో సరసాలాడెడివారు.[3]

  1. ఆముక్తమాల్యద. 4 - 7.
  2. కృష్ణరాయ చరిత్ర. 2 - 5.
  3. ఆముక్తమాల్యద. 4 - 35.