పుట:Andrulasangikach025988mbp.pdf/222

ఈ పుట ఆమోదించబడ్డది

రాజులు, ధనికులు, సంపన్నులు వేసుకొనుచుండిన తాంబూలాలు విలువయిన సుగంధ ద్రవ్యములతో కూటినట్టివి. అవి,

         "బండిత పూగీ నాగర ఖండంబుల ఘనశశాంక ఖండంబులచే
          హిండితమగు తాంబూలములు"[1]

వక్కలు, సొంటి, పచ్చకర్పూరము తాంబూలములతో చేరియుండెను. అంతేకాదు, అవి,

         "మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్రవీటి గంధ
          స్థగితేతర పరిమళమై" యొప్పెను[2]

అన్నివర్గములవారు తాంబూలము వేసి రనియు, అది యుత్తేజకరమయినదనియు, అందుచేతనే రాజు 200 మంది భార్యలపయిగా ఉంపుడు గత్తెలతో భోగింపగలిగెనేమో! అనియు అబ్దుర్రజాఖ్ ఆశ్చర్యముతో వ్రాసెను.

తాంబూల సంబారములుంచు కరండికల సుందరముగాను, వెండి బంగారుతో చేయబడినవిగాను, సన్నని తీగె పనులు కలవిగాను ఉండెడివి. అందుచే వాటిని "జాలవల్లికలు" అని వ్యవహరించిరి.[3] సంపన్నులు స్నానము చేయునప్పుడు వాడుకొనిన నలుగుపిండికూడ విలువైనట్టిది. "హరిద్రామలకాదిక స్నానీయ వస్తు వ్రజంబు[4] పసుపు, ఉసిరికపోడి మొదలయిన స్నాన వస్తువులు అనుటచే పిండిలో వాటిని కలిపిరని అర్థము. పెసలు, సెనగలు విసరిన పిండిలో అవి కలిపెడివారు. ఇది స్త్రీల స్నానపు పిండి, పురుషులు "గంధామలకంబు" గంధపు పొడి, ఉసిరిక కలసిన పిండిని రుద్దుకొనిరి.[5] స్నానానంతరము స్త్రీలు అగరు ధూపమును వెంట్రుకలకు వేసి జవ్వాజి పూయుచుండిరి. మరికొందరు "హరిచందన గోరోచనాగరు ప్రకల్పిత

  1. ఆముక్తమాల్యద 5 - 93.
  2. మనుచరిత్ర 2 - 24.
  3. పారిజాతాపహరణము 2 - 20.
  4. ఆముక్తమాల్యద 5 - 89.
  5. పారిజాతాపహరణము, 5 - 56.