పుట:Andrulasangikach025988mbp.pdf/221

ఈ పుట ఆమోదించబడ్డది

          మెలతయడపముదే, జరన్మేరు వనగ
          తలవరులు గొంద రొలసి ముంగల జనంగ
          అర్థి రధ్యాంత:పురాంతరమున
          భోగినీసంగతికి రాజు పోవుచుండి."[1]

రాజులు పన్నీటితో కలిపిన కస్తూరిని పూసుకొనుచుండిరి. పొడవైన కుచ్చుటోపీలు పెట్టుకొనుచుండిరి. చెవులలో ముత్యాల పెద్ద పోగులును, కంఠ మందు ముత్యాల హారమును ధరించు ఎర్రని అంచుగల తెల్లనివస్త్రాలు ధరించిరి. బంగారు పిడిగల కత్తిని చేతబట్టిరి. పరిచారిక (ఆడపాప!) తాంబూలకరండమును (పాన్‌దాన్) పట్టుకొని వెంట నుండెడిది. ముందర తలారులు నడిచిరి. ఇవన్నియు బోగముదాని యింటికి వెళ్ళునప్పటి సంరంభము.

రాచనగళ్ళలో నెమళ్ళను పెంచుతుండిరి. సుఖముగా నిద్రించిన రాచవారు ప్రొద్దెక్కిన తర్వాతనే మేల్కొనెడివారు. తర్వాత గమగమ పరిమళించే పువ్వులతో చేయబడిన "గంధరాజము" అనెడి పరిమళ ద్రవ్యముతో అంగమర్దనము చేయించుకొని చాలాసేపు వేన్నీళ్ళ స్నానము చేసి తెల్లని ధౌతవస్త్రములను నానావిధ హారములను ధరిస్తూ వుండిరి. అటుపిమ్మట సన్నని వరియన్నమును, వేటాడి తెచ్చిన అడవిమృగ పక్షుల మాంసమువంటను, అపుడు కాచిన వెన్నతో కలిపి ఆరగించెడివారు. కస్తూరీ సమ్మిశ్రిత తాంబూలమును వేసుకొని రాత్రులందు మేడలపైకి వెళ్ళి అందు చిన్న చక్రములతో కూడిన లోహపు కుంట్లలో అగరు చెక్కల ధూపమును ఆఘ్రాణించుతూ అంత:పురసుందరులతో ఆనందించుతూ వుండిరి.[2] రాచవారి వేషాలు కూడ, సామాన్యుల వేషాలతో భిన్నించినవై యుండెను.

          "జడలు మడంచి,చొళ్లెముగ సన్నపుబాగడలంగ జుట్టి చ
           ల్లడములు పూని మీద బదిలంబుగ గట్టిన మట్టికాసెలం
           బిడియము లందదోపి పృథు భీషణ బాహుల సాళువంబులన్
           దడలి కెలర్చుచున్ జనిరి నాథుని మ్రోల నృపాల నందనుల్"[3]

  1. ఆముక్త మాల్యద 2 - 75.
  2. ఆము. 4 - 135.
  3. మనుచరిత్ర. 4 - 30