పుట:Andrulasangikach025988mbp.pdf/203

ఈ పుట ఆమోదించబడ్డది

డును ఉండెడివారు వెనుక భాగమందలి నాయకుని "దుముదారు దొర" అనిరి[1] ఇది ఉర్దూపదము, దుం అన తోక; దార్ అన రక్షించువాడు. అనగా వెనుకభాగమును రక్షించు సేనాని. విజయనగరమందు,

       "...తూర్ణోచ్ఛముల్ వాజులం దలరున్,బాహ్లిక, పారసీక శకధ
        ట్టారట్ట ఘోటాణముల్"[2]

బాహ్లికమన బలఖ్ దేశము. పారసీకము ఈరాన్. శక అన సితియన్, గ్రీకుల సాగ్డియా ఈరానుకు పశ్చిమముననుండు ప్రాంతము. ధట్ల ఎచ్చటనో తెలియదు. ధట్టనుండియే తట్టు, తట్టువ పదము లేర్పడెనని శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రి వ్యాఖ్య. ఆరట్ట పంజాబు ప్రాంతభూమి, యుద్ధమునకు పనికివచ్చు గుర్రాలు దక్షిణ హిందూస్థానమందుత్పత్తి కాకుండెను. ఉత్తమాశ్వములకు ప్రసిద్ధిగన్న దేశమును మధ్యఆసియాలోని తార్తరీ, భోటాన్, ఖురాసాన్, ఈరాన్ అరేబియా దేశాలును కొంత వరకు ఆప్గనిస్థానమును, సింధు, పంజాబు దేశములునునై యుండెను. నామలింగానుశాసనములో అమరుడు గుర్రములకిచ్చిన పర్యాయపదము లన్నింటికి లింగాభట్టీయములో ఏదో యొక వ్యుత్పత్తిని సాగదీసి అర్థము చెప్పినారు. కాని అవి సరియని చెప్పుటకు వీలులేదు. అమరములోని ఆశ్వపర్యాయ శబ్దములలో పెక్కు శబ్దములు గుర్రములు బహుళముగా దొరకు దేశముల పేర్లని నేనూహించినాను. ఆప్ఘనులకు ప్రాచీననామము అశ్వకానులు. (అదే అహ్వాకాన్, అఫగాన్ అయ్యెను) అశ్వములు కలవారని ఆశ్వకాన్ శబ్దము తెలుపుతున్నది. మధ్య ఏషియాలో భోటాన్ గుర్రాలే ఘోటకములై యుండును. కృష్ణరాయలు ఘోట్టాణముల్ అని వాడినదియు గమనింపదగినది. తురికీ దేశపుదికాన తురికీయన గుర్రమను నర్థమయ్యెను. తెనుగులో సామ్రాణి గుర్రాలు అని కొందరు కవులు వాడిరి. అనగా ఈరాన్‌లోని సమరాన్ అను స్థలమునుండి వచ్చినవని యర్థము. ఖురాసాని అని మరికొందరు గుర్రమునకు పేరు పెట్టిరి. మధ్య యేషియాలోని ఖురాసాన్‌నుండి వచ్చినవన్నమాట. గుర్రమును గురించిన చర్చ చాలా కలదు. దానిని గురించి ప్రత్యేకముగా వ్రాయవలసి యుండును.

  1. మనుచరిత్ర 3 - 54.
  2. ఆముక్త మాల్యద, 2 - 20.