పుట:Andrulasangikach025988mbp.pdf/175

ఈ పుట ఆమోదించబడ్డది

యక్షులు జక్కు అను దేశి (ద్రావిడ)శబ్దమును సంస్కృతములోనికి తీసికొని యక్షశబ్దముగా సంస్కృతీకరించిరో యేమో? అనార్య జాతులలో యక్షులు చేరినారు. యక్ష కిన్నర గంధర్వ పన్నగ పిశాచ రాక్షసాదివర్గాలన్నియు అనార్య జాతులే.

కిన్నెర లను జాతిని ప్రాచీన గ్రీకులు కినారై (Kinaries)అనిరి. గంధర్వు లనగా కాశ్మీరు ప్రాంతమందలి గాంధార దేశమువారు. పన్నగ జాతి మద్య ఏషియా లోనివారు, పిశాచులు టిబెటు, మంగోలియా ప్రాంతాలవారు. రాక్షసులు అరక్షన్(Araxes) అను నదీప్రాంతమువారై యుందురు. అటులే యక్షులు అక్షస్ (Oxus)లేక జక్షార్తస్ (Jaxartes) ప్రాంతవారైనను కావచ్చును. లేదా క్రీస్తుశకారంభమున మన దేశములో పశ్చిమోత్తర భాగాలను గెలిచి పాలించిన యఛీ (Yuchi) అను జాతియైనను కావచ్చును. అయితే వారు మన తెనుగుదేశ లోని జక్కులతో నే సంబంధము కలవారో తెలియదు. యక్షుల వేషాలువేసి గానములో ప్రసిద్ధియైన యక్షుల పేరుతో వెలసిన యక్షగానములను ప్రయోగించి నాటకాలాడినందున జక్కులవారను మన నటకులకు పేరు వచ్చెనేమో ఆలోచనీయముగా నున్నది.

మనకు విజయనగరరాజుల కాలమునుండి కొన్ని యక్షగాన నాటకముల పేరులు తెలియవచ్చినవి. కొన్ని లభించినవి. అంతకుపూర్వము యక్షగానాల నాటకాలను విరివిగా ఆడినట్లు నిదర్శనములు కలవు.

"కీర్తింతు రెవ్వానికీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగానసరణి" అని భీమేస్వర పురాణమున వర్ణితము.

జక్కులవారే మొదట నాటకా లాడియుండినవారు శివసంబంధమగు కథలను ప్రదర్శించి యుందురు. శైవకథలను ఆడి ప్రదర్శిస్తూ వుండిరని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో తెలిపినాడు.

         "అచట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాత్రల నాడించువారు"

అని పర్వత ప్రకరణమం దన్నాడు. తర్వాత భాగవత కథలను, వైష్ణవ గురువుల చేతను, రాజులచేతను ప్రోత్సహింపబడి ఆటలాడి జనులలో వైష్ణవము వ్యాపింపచేసి శైవమును నణగద్రొక్కుటకు దీనిని గూడా సాధనముగా గైకొని యుందురు. భాగవత కథలను ఆటలుగా నాడువారిని భాగవతులు అనిరి. వారే