పుట:Andrulasangikach025988mbp.pdf/174

ఈ పుట ఆమోదించబడ్డది

వసంతోత్సవములు రాజులకు ప్రీతిపాత్రము లగుటచే అవి జనులలోను వ్యాపించిపోయెను. దక్షవాటికలో భోగమువారి గుంపులు రెండుండెను. వారు వసంతోత్సవ కాలములందు భీమేశ్వరునివద్ద నాట్యమాడి గానము చేస్తూ వుండిరి.

వసంతోత్సవాలలో 'కుసుమరజము', 'గంధంబు పసుపు', 'గంధపుటుం డలు ఒకరి పైనొకరు వేసుకొనుచుండిరి. పన్నీరు, రంగులు పిచికారీలతో 'చిమ్ము'కొనుచుండిరి మరియు,

         "నేతులనూనెలం బసుపు నీరును కుంకుమ చెందిరంబులన్
          నూతన గంధసారములను న్నొనరించిరి కేలితంత్రముల్"[1]

'చిరుబంతి పసుపు'ను 'గాజు కుప్పెల గస్తూరిజలము'ను సంపన్నులు చల్లుకొంటూ వుండిరి. "కర్పూరాది సుగంధద్రవ్యంబులు వసంత చాలనంబొనర్చెడివారిలో నుండి కలహకంటకుండను రాచలెంక వెడలివచ్చుచు తన మీసములను నంటిన సుగంధంబు విదిర్చికొనుచు" వెళ్ళెను.[2] అను వాక్యమును బట్టి జనులలో వసంతోత్సవము వ్యాప్తిలో నుండెననుట స్పష్టము.

జనులకు నాటకములందు చాలాప్రీతి. నాటకముల ముచ్చటలు పలుమారు సారస్వతములో కానవచ్చినవి. కాని అవి సంస్కృత నాటకములు కానీ, వాటి రీతుల అనుకరణములు కానీ కావు అదేమి కారణమో ఈ 20 వ శతాబ్దదివరకు సంస్కృత మర్యాదలతో కూడిన నాటకాలు తెనుగున వ్రాయలేదు. పెద్దపెద్ద కవులుకూడా "యక్షగానాలు" వ్రాసిరి. యక్షగానము అని యేల పేరువచ్చెనో తెలియదు. ఈ యక్షగానాలు సంస్కృత నాటకాలకు భిన్నమైనవై దక్షిణదేశమునం దంతటను జనుల కాదరపాత్రములై ప్రీతికరములై వ్యాప్తిలో నుండినట్టివి కాన ఇవి నన్నయ కంటే పూర్వమునుండి వచ్చిన "దేశికవితాయుక్తమగు పాటల నాటకాలై యుండెను. "అక్కలేజోగు" అని కామేశ్వర్యాది శక్తిదేవతల గొలుచు జక్కులవారను జాతివారు తెనుగుదేశములో కలరు. ప్రాచీనమునుండియు కవులు "జక్కులపురంధ్రీ" వర్గమును వర్ణించుతూ వచ్చినారు. ఈ జక్కుల వారే

  1. భీమేశ్వర పురాణము, అ 5. ప 116.
  2. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 20.