పుట:Andrulasangikach025988mbp.pdf/172

ఈ పుట ఆమోదించబడ్డది

కాయ నొక యింటిలో నుంచిన రెండవవాడును తన దిక్కేకాక తన యిష్టము వచ్చినచోట తన కాయ నుంచును. ఈ విధముగా కాయలు కాయలు పెట్టుటలో ఒకడు తన కాయల మూడింటిని ఒకే వరుసలో పెట్టనియ్యక తన కాయను ఆవరుసలో పెట్టవలెను! ఆ యాటంకములను తప్పించుకొని ఒక డొకే వరుసలో తనమూడు కాయలు పెట్టిన యెదుటివాని కాయనేదైన నొక దానిని తీసివేయును. ఈ యాటను చర పర్ అని యందురు. తన కాయలను మూటి నొక వరుస పెట్టి చర్ అని యెదుటవాని కాయను తీసివేయును. మరల తన కాయను వెనుకకు జరిపి స్వస్థానానికి తెచ్చి మూటి నొక వరుసచేసి పర్ అని ఎదుటివాని కాయను మరొక దానిని తీసివేయును. అందుచే నీ యాటను చర్ పర్ ఆట యనియు నందురు.

కావున ఈ యాటలో నేదైనా మూడవ పులి జూదములో చేరిన దేమో తెలియదు. ఈ యాటలన్నియు తెనుగు మండలా లన్నింటిలో నున్నవో లేవో గట్టిగా చెప్పజాలము కొరవి గోపరాజు పుణ్యమా అన్నట్లు అతని వర్ణననుబట్టి మన పూర్వుల యీ వినోదాలు కొన్నియైనా తెలియ వచ్చినవి.

మారేడుపల్లి సికింద్రాబాదు నుండి శ్రీయుత తాడేపల్లి కృష్ణమూర్తిగా రనువారు నాకిట్లు వ్రాసియుండిరి. "మూడు విధములగు జూదములలో రెండు తెలిపి మూడవది తెలియదన్నారు. మూడవ విధమగు పులిజూద మిట్లాడుదురు.

ఈ యాటకు 3 పులులు 15 మేకలుండును. కొందరు 3 పులులు 14 మేకలతో ఆడుదురు. ఆట యారంబమందు మొదట 1 వ స్థానమం దొక పులిని పెట్టుదురు. తర్వాత క్రమముగా 2, 3, 4 ఇండ్లలో తక్కిన మూడింటి నుంచుదురు. ఆట తక్కిన ఆటలవలెను పుల కట్టుటయో లేక మేకలను పులులు చంపుటయో ఆటకు ముగింపు. ఈ యాట ఉత్తర సర్కారులలో ఆడుదురు.