పుట:Andrulasangikach025988mbp.pdf/167

ఈ పుట ఆమోదించబడ్డది

జూదములు అనేకవిధములైనవి ఆడుతూవుండిరి. అందుకొన్ని కాకతీయ కాలమందలివి తెలిపియుంటిమి. అవన్నియు ఈ కాలములోనూ వుండెను. ఒక మేటిజూదరి తన ద్యూతచాతుర్యమును నిట్లు తెలుపుకొనెను.

       "దృష్టి యేమరక నందయు, జోగరంబును దిగయును, గాళ నా తేటపడిన
        అచ్చులలోపలనే యచ్చన గైకొని మాటలాడినయట్ల వేటు గలుగ
        తలపుగతి వచ్చు కోరిన దాయ మనగ...ఎల్లపిడికిళ్ళు విడిపించుకొని యేనకొందు."[1]

ఈ యాటను పల్లెజనులు లక్కిముష్టి, నక్కముష్టి, అని యందురు. బహుశ అది నక్కముష్టియై యుండునేమో! ఒకడు గవ్వలుకాని, చింతబిచ్చలు కాని పట్టుకొని వచ్చును. నాలుగు బిచ్చలు ఒక ఉడ్డ యగును. పిడికిలి పట్టినవాని కొకదిక్కు వదలి తక్కిన మూడుదిక్కులలో ఎందరైనను సరే, తమ కిష్టమువచ్చినన్ని రూకాలుకాని, పైసలుకాని యుంతురు. పిడికిలి వట్టినవారు ఉడ్డలప్రకార మెంచగా, నాలుగు మిగిలితే దానిని మష్టయందురు. మూడుమిగిలితే దానిని తిగ యందురు. రెండు మిగిలితే దుగ యందురు. ఒకటి మిగిలితే దానిని నక్క యందురు. నక్కనుండి మష్టవరకు నాఠాగు సంకేతము లున్నందున దానిని నక్కమష్ట అనిరనియు, అదియే నక్కముష్టిగా లేక లక్కముష్టిగా మారెననియు ఊహింపవచ్చును. ముష్టిపట్టినవాని యింట సంఖ్యయే మిగిలిన, వాడు తక్కిన మూడిండ్లవారి పైకమంతయు తీసుకొనును. లేక తనకేయి ట సంఖ్యవచ్చునో ఆ సంఖ్యలో నెంత పైకముండునో అంత యిచ్చి, తక్కిన సంఖ్యలవారి మొత్తములను వదిలివేయవలెను.

పైన వర్ణించిన కవియు నాలు సంకేతములను తెలిపినాడు. కాళయన నాలుగైయుండును. తిగ యన మూడు, నంది యన ఒకటి. జోగర యన రెండై యుండును, వర్ణించిన వరుస కూడ పైయర్థముల సూచించును. అచ్చులన పట్టుకొనివచ్చు గవ్వలో, క్రచ్చకాయలో లేక అంతటి చిన్న గులకరాళ్ళో యని యర్థము.

చదరంగపు పందెములు గూడా వుండెను.

  1. సింహాసన ద్వాత్రింశిక. భా 2. పు 85.