పుట:Andrulasangikach025988mbp.pdf/166

ఈ పుట ఆమోదించబడ్డది

మాయమయైను. కొంతవడికి వాని కాలుసేతులు, తల, మొండెము తుంటలై క్రిందబడెను. వాడుంకువగా నుంచిపోయిన వానిభార్య రాజును వేడి సెలవు పొంది సహగమనము చేసెను.

వెంటనే త్రాడు పైకి ప్రాకిపోయిన భటుడు పైనుండి దిగివచ్చి తనభార్యను పంపుమనెను. రాజు విచారగ్రస్తుడై ఆమె సహగమనము చేసెనని చెప్పెను.

        "ఆవీరుం డప్పుడే నిజ భావము ప్రకటముగ నాత్మభామినితోడన్
         దా వై తాళికు డగుచున్ గైవారము చేసె జనులు కడు వెరగందన్.
         నరనాథ! నిన్ను నపుడవసర మడిగినవాడ, నైంద్రజాలికురీతిన్
         నరుల నణకించి నీచే సిరి వొందం జోద్య మిట్లు చేసితి ననియెన్"[1]

ఇది అ నాటి ఇంద్రజాలవిద్య, అదేసందర్బములో చతుష్షష్టికళల పరిగణనమును కూడ తెలిపినారు. అందీ క్రిందివి చేరినవి. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, వాస్తు, అతుర్వేదము, ధనుర్వేదము, మాంత్రికత్వము, సంగీతము, జలస్తంభనాదులు, (మహేంద్రజాలము), జూదములు, అష్టావధానము, వాద్యనృత్య కౌశలము, బహురూపనటనత్వము (అనగా పగటివేషములు), పరిహాసము మున్నగునవి.[2]

కాకతీయరాజుల కాలమందు శ్రీకాకుళము తిరునాళ్ళ ప్రసిద్ధిగా నుండినట్లు క్రీడాభిరామమందు వర్ణింపబడినది. అంతకు పూర్వకాలమందే అది ప్రసిద్ధియై యుండినట్లు మంచన కేయూరబాహుచరిత్రలో వ్రాసెను.

         "నలువుగ కాకుళేశు తిరునాళులలోపల గుండమంత్రి ని
          ర్మలమతి బిట్టు వేగముగ మాడలు రత్నచయంబు చల్లె"......[3]

అని వర్ణించుటచే పూర్వకాలమందు రాజులు మంత్రులు ఉత్సవకాలాలలో రూకలుచల్లి బీదలకు దానము చేయుచుండిరని విశదమైనది.

  1. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 111
  2. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 102
  3. కేయూర బాహుచరిత్ర, ఆ 1. ప 45.