పుట:Andrulasangikach025988mbp.pdf/134

ఈ పుట ఆమోదించబడ్డది

కొండవీటిలో నే సందులలో జూచినను విభూతిభస్మాంచితులును, నిరాకృతులును నగు చిల్లరకవులుండుటను గమనించి శ్రీనాథుడు ఆకవులవలె తిరుగు గాడిదలను ఇట్లు ప్రశ్నించెను.

         "బూడిదబుంగవై యొడలు
          పోడిమి తక్కి మొగంబు వెల్లనై
          వాడల వాడలం దిరిగి
          వాడును వీడును చొ చ్చొ చో యనన్,
          గోడల గొందులం దొదిగి
          కూయుచునుందువు కొండవీటిలో
          గాడిద ! నీవునుం గవివి
          కాదుకదా ! యనుమాన మయ్యెడిన్ !!

రెడ్డిరాజుల కాలములో సంస్కృతాంధ్ర పండితు లనేకు లుండిరి. అందు కొందరికృతులే మనకు లభ్యమైనవి. మన దురదృష్టమేమో 500 ఏండ్లలోనే శ్రీనాథుని బహుకృతులు, శంభుదాసుని రామాయణము, కుమారగిరి వసంతరాజీయము, ఇట్టి ముఖ్యమైనవి జాడలేకుండా పోయెను. బాలసరస్వతి అనునతడు అనపోతరెడ్డి యాస్థానకవియనియు, త్రిలోచనాచార్యుడనునతడు అనవేముని ఆస్థానకవియనియు మాత్రమే మనకు తెలియవచ్చినది. పలువురి కవితలు శాసనాలలో మాత్రమే మిగిలిపోయినవి. ప్రకాశ భారతయోగి అనునతడు చక్కని శాసనశ్లోకాలు వ్రాసెనని మాత్రమే మనమెరుగుదుము. వెన్నెలకంటి సూర కవితో పాటు మహాదేవకవి యుండెనన్నంతవరకే యెరిగితిమి. అనపర్తి శాసనమందే అన్నయకవి పద్యాలు చక్కని కవితాపాకముగలవి మనమెరుంగుదుము. కాటయవేముని శాసనము కవితలో వ్రాసిన శ్రీవల్లభుడను నతని చరిత్ర మన మెరుగము. ఇంకెందరి విజ్ఞానసంపదను మనము కోలుపోయినామో యేమో ? రెడ్ల యాశ్రయములో ఎర్రాప్రెగడ, శ్రీనాథుడు, వెన్నెలకంటి సూరన, నిశ్శంక కొమ్మన అను ప్రసిద్ధకవులుండిరి. వామనుభట్ట బాణుడను సంస్కృతకవి వేమభూపాల చరిత్రమును సంస్కృతములో వ్రాసెను. రెడ్డిరాజులు స్వయముగా గీర్వాణములో వ్యాఖ్యలు, కవితలువ్రాసిరి. కుమారగిరిరెడ్డి వసంతరాజీయమను నాట్యశాస్త్రమును వ్రాసెను. పెద కోమటియు నొక నాట్యశాస్త్రమును రచించెనందురు. కాటయ వేమన కాళిదాస నాటకములకు వ్యాఖ్యలు వ్రాసెను. పెదకోమటి