ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయమునుండి కన్యాకుమారి వరకుండు వివిధ భాషావర్గముల వారిని చూచుచు వెళ్ళిన, అపారమగు వైవిధ్యము అడుగడుగునకు వ్యక్తమగును. మళయాళి, అరవ, మరాటి, పంజాబీ, బంగాళీ మున్నగువారిని చూచిన ఒకరితో ఒకరు వేషభాషా విశేషములందు పోలినవారు కారు. ఆహార విహారములందును భేదము కలదు. మళయాళీలు బియ్యము, టెంకాయలు తప్ప వేరే యెరుగరు. తమిళులకు బియ్యము, పులుసు చాలా యిష్టము, మరాటీలకు రొట్టెలే కావలెను. బంగాళీలకు బియ్యము, చేపలు కావలెను. కాశ్మీరీలు మాంసములేనిది మాట వినరు. ఇట్టి బహుకారణాలచేత ఆంధ్రుల సాంఘిక చరిత్రయొక్క యావశ్యకత చాలా యవసరమని తోపక మానదు.

రాజుల రాజ్యాల చరిత్ర వ్రాయుట అంత కష్టముకాదు. కాని, సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీజనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాఙ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్దులు, జంగము కథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు (Collections) - ఇవి సాంఘిక చరిత్రకు పనికివచ్చు సాధనములు.

కావ్య ప్రబంధాలలో నూటికి 90 పాళ్ళు సాంఘిక చరిత్రకు పనికివచ్చునవి కావు. పురాణాలు, మధ్యకాలపు ప్రబంధాలు ఇందుకు పనికిరావు. ఎందరో మహాకవులు వసు మను చరిత్రల వంటివి వ్రాసినవారు మనకు సాయపడరు.

"కేళీ నట ద్గేహ కేకి కేకారవో! న్మేషంబు చెవుల దేనియలు చిలుక" [కవికర్ణ రసాయనము]

వంటి వర్ణనలు మనకు సహాయపడవు.

"గొంగడి ముసుగుతో గొల్లలు చట్రాతి - పైని బందారాకు బరిచికొనగ" [శుకసప్తతి]

అన్న వర్షర్తు వర్ణన మనకు చాలా పనికివచ్చును.

"తతనితంబాభోగ ధవశాంశుకములోని యంగదట్టపు కావిరంగువలన" [మనుచరిత్ర]

అంటే మనకు సరిగా అర్థమేకాదు.