పుట:Andrulasangikach025988mbp.pdf/127

ఈ పుట ఆమోదించబడ్డది

తెనుగుదేశము సన్నని నూలుబట్టలకు ప్రసిద్ధి. రుద్రమదేవి కాలములోని సన్నని నూలుబట్టలు మహారాజులకే తగినట్టివని పాశ్చాత్యయాంత్రికు లానాడే వ్రాసిరి. తెనుగు దేశమందంతటను నూలుబట్టల వ్యాపారమే అగ్రస్థానము వహించెను. ఇంటింట రాటమాడుచుండెను. కదురాడిన, కవ్వమాడిన యింటికి దరిద్ర మెన్నడనూ ఉండదని పెద్దలనెడివారు. శూద్రులలో ప్రతి స్త్రీయు రాటముపై వడకుటను నేర్చియుండె ననవచ్చును. బీదలు తమ యవసరాలకు సరిపోగా మిగిలిన దారపుకండెలను అమ్ముకొంటూ వుండిరి. అవి వస్త్రాలుగా సిద్ధమై తూర్పు పడమటి దేశ దేశాంతరాల కెగుమతి యవుతుండెను. పల్నాటిలో,

"రంభయైన యేకులె వడకున్"

అనుటచే ఆ సీమలో స్త్రీ లందరును వడికిరన్నమాట. అయితే తూర్పు తీరములో ఉత్తమజాతులవారు వడుకకుండిరేమో ?

నూలుబట్టలేకాక, పట్టుబట్టలును బాగా వ్యాప్తిలో నుండినట్లు కానవస్తున్నది. పట్టులో అనేక భేదములుండెను. "చందనకాపులును, పట్టెడుకాపులును, చెంగావులను, కదంబకాపులును, కరకంచులును, బొమ్మంచులును, ముడుగుబొమ్మంచులును, ముయ్యంచులును, చిలుక చాళ్ళును, వేటచాళ్లును, నిండువన్నెలును, ఉఱుతచారల వన్నెలును, గంటకి వన్నెలును, పుప్పొడివన్నెలును, రుద్రాక్షవన్నెలును, నాగాబంధములును, పూజాబంధములును, జలపంజరంబులును, కామవరంబులును, సూరవరంబులును, తారామండలంబులును, హంసావళులును, హరిణావళులును, తురగావళులును, గజావళులును, సింహావళులును, ద్రౌపదీ స్వయంవరంబులును, లక్ష్మీవిలాసంబులును, మదన విలాసంబులును, వసంత విలాసంబులును, రత్నకీలితంబులును, రాయశృంగారంబులును, కనకదండెలును, గచ్చిలంబులును, కరూర గంధులును, పారువంపు గంధులును, శ్రీతోపులును, శ్రీరామ తోపులును, శ్రీకృష్ణ విలాసంబులును, జీబులును, సుగుపట్టంబులును, సన్న వలిపంబులును, వెలిపట్టులును, హొంబట్టును, పులిగోతుపట్టును, ఉదయరాగపట్టును, నేత్రపట్టును, వజ్రపట్టును అను పేళ్ళుగల పుట్టంబులు[1] ఆ కాలమందుండెను. "అరుదైన పసిడి హంసావళివన్నె; జిగిజిగి ధగధగయను చీనాంబరంబు" అని గౌరన వర్ణించెను. (నవనాథచరిత్ర పుట 4.)

  1. సింహాసన ద్వాత్రింశిక, భా 1 పు 74.