ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞప్తి

ఆంధ్రమహాజనులారా ;

విజ్ఞానచంద్రికా మండలి,ఆంధ్రభాషాభివర్ధనీ సంఘము, ఆంధ్రప్రచారిణీమండలి లోనగు సంఘములు బయలు వెడలి తమయనర్ఘ్య గ్రంథకుసుమములభాషాయోషంబూజించి దేశమున కభ్యుదయ పరంపరాభివృద్ధి నొదవించుట గాంచి, మేమును యథాశక్తి దేశభాషాసేవం జేయ దలచి యీయితిహాస తరంగిణీగ్రంథమాలంగూర్ప సమకట్టితిమి.

ఇందు దేశ చరిత్రములు, చరిత్రాత్మకములైన నవలలు, భాషాతత్వముం దెల్పు గ్రంథవిమర్శనములు మొదలగు గ్రంథము లేడాదికి మూడుచొప్పున ముద్రింప బడుచుండును. చారిత్రకజ్ఞానము లేనివానిజీవితము అయస్కాంతములేని నౌకాయాత్రవంటి దని చెప్పున ట్లీవఱ కాంధ్రప్రపంచము తొల్లి తనపూర్వు లేమార్గములం ద్రొక్కి యింతింతనరాని యభివృద్ధింగాంచి యలరిరో, యెట్లవక్ర పరాక్రమముం జూపి యభిమన్యునింబోలె గీతిన్ శేషులై తమ సామ్రాజ్యములం గోలుపోయిరో తెలిసికొన జాలక తట్టుముట్టాడుచుండెను. ఈకొఱత దీర్ప విజ్ఞానచంద్రికామండలి సమకట్టి ఆంధ్రులచరిత్ర రెండుభాగములును, ఆంధ్రదేశచరిత్రాత్మకములైన నవలాగ్రంథములు నాలుగింటిని నాంధ్రలోకమున కొసగెను.