పుట:Andhrula Charitramu Part 2.pdf/62

ఈ పుట ఆమోదించబడ్డది

25

చూచి స్పృహతప్పిపడిపోయెనట. మాయవేషధారి యగునాజంగమ తప్పించుకొని పారిపోయెను. అంతట బిజ్జలునికుమారుడు మొదలగువారెల్లరును వచ్చిరి. బిజ్జలుడు కొంతసేపటికి దెలివినొంది, జరిగిన వృత్తాంతమంతయు దెలిసికొని, తనకుమారుడగు సోమేశ్వరునకు బసవేశ్వరుని జంపనుత్తరువు చేసెనట. తక్షణమే యిమ్మడి బిజ్జలుడు బసవేశ్వరుని బట్టుకొనవలసినదనియు, జంగములెక్కడ గానిపించినను చంపవలసినదనియు, దన పరివారమునకాజ్ఞ చేసెను. ఈ వార్తవిని బసవేశ్వరుడు పారిపోయెను. ఇమ్మడిబిజ్జలుడా పట్టణమును ముట్టడించెనట. బసవేశ్వరుడు తప్పించుకొను వెరవులేక యొక బావిలోపడి మృతనొందగా, నతని భార్యయు విషము గ్రోలి ప్రాణత్యాగము చేసెనట. బిజ్జలుని కుమారుడు శాంతచిత్తుడైన వెనుక బసవేశ్వరుని మేనల్లుడగు చెన్నబసవయ్య తన మేనమామ యాస్తినంతయు వశపరచి యతనికి లోబడి యాతని దయకు బాత్రుడయ్యెనట. [1]ఈ చెన్నబసవేశ్వరుడు లింగాయతులకు నాయకుడై బసవేశ్వరునికంటె నుత్తమస్థితికి వచ్చి చక్కని కట్టుదిట్టములేర్పరిచి వీరశైవమునుద్ధరించెనట. [2] వీరశైవమతమును బోధించుటకై ప్రణవమీతనిలోపల నావిర్భవించెను. చెన్నబసవపురాణమును బట్టి చెన్నబసవడు శివుడనియు, బసవడు నంది

  1. Wilson's Mackengie Mss. p. 320.
  2. మొట్టమొదట వీరశైవమతమును సంస్కరించి బోధించినవాడు ఏకాంతాడ రామయ్య యనునాతడనియు, బిజ్జలుడు జైనుడయినను వీరశైవులయెడ విరుద్ధముగా బ్రవర్తింపలేదనియు, కొంతవరకు సమ్మతిని గనబరచుచు వచ్చెననియు, నిజాముమండలములోని నిడుగల్లు శాసనము మొదలగు వాని వలన దెలియుచున్నది. అయిననీవిషయమింకను బరిశోధింపవలసియున్నదని డాక్టరు ఫ్లీటుగారభిప్రాయపడియున్నారు.