పుట:Andhrula Charitramu Part 2.pdf/55

ఈ పుట ఆమోదించబడ్డది

నామమును వహించుచుండిరి. కనుకనే బిజ్జలుడును ఆ బిరుదమునే ధరించియుండెను. "ఈ బిజ్జలరాజు 1150 మొదలు 1162వ సంవత్సరము వరకు రాజ్యముచేసిన (చాళుక్య) త్రైలోక్యమల్లుని సేనాధిపతిగానుండి 1162వ సంవత్సరమున కళ్యాణపురాధీశ్వరత్వమును తానే యపహరించి, లింగాయతమతమును స్థాపించిన బసవేశ్వరుని తోబుట్టువగు పద్మావతియొక్క చక్కదనమునకు మక్కువగొని యామెను వివాహమాడి తన మంత్రినిగా జేసికొన్న బసవేశ్వరునిచేత చంపబడెను." అని, నెల్లూరి మనుమసిద్ధి రాజుయొక్క పూర్వీకుడయిన బిజ్జనయే యీ బిజ్జలుడని యభిప్రాయపడి శ్రీవీరేశలింగం పంతులుగారు తమ కవులచరిత్రయందట్లు వ్రాసియున్నారు. [1]మనుమసిద్ధి పూర్వీకుడయిన బిజ్జన సూర్యవంశపు రాజు. కళ్యాణపురాధీశ్వరుడయిన బిజ్జలుడు చంద్రవంశపు రాజు. కావున వీరిరువురకు నేవిధమైన సంబంధమును లేదు. ఈ బిజ్జలరాజు చాళుక్యరాజ్యమపహరించిన వాడను మాటయే నిలిచియుండెను. మరియు నితడుగాని, ఈతని తరువాతి వారుగాని, చిరకాలము రాజ్యఫలములనుభవించి సుఖతరంబుగ జీవింపక పోవుట యటుండ, నచిరకాలములోనే స్వకుటుంబపరివార సహితముగా నాశనముకూడ గావలసివచ్చెను.

మతవిప్లవము.

దక్షిణహిందూస్థానమున మున్నెన్నడును గనివినియెరుంగనట్టి మతవిప్లవము సంప్రాప్తమయ్యెను. వైష్ణవము వీరవైష్ణవమై విజృంభించుచుండెనని యిదివరకే తెలిపియున్నాడ. స్మార్తమతమొకప్రక్కను, వైష్ణవమతమొక ప్రక్కను, జైనమతము వేరొక ప్రక్కను అభివృద్ధినొందుచుండ, శైవమతము క్షీణించుటకు బ్రారంభించెను. కాబట్టి శైవమతము గూడ నుద్ధరింపబడుటకు గొప్ప సంస్కరణకర్త యెదురుచూడ బడుచుండెను. అతడే బసవేశ్వరుడు.

  1. ఆంధ్రకవుల చరిత్రము, ప్రథమభాగము, పుట.47.