పుట:Andhrula Charitramu Part 2.pdf/44

ఈ పుట ఆమోదించబడ్డది

కొమార్తెను బ్రహ్మరాక్షసుడు పట్టుకొని వేధించుచుండెను. అందువలన నారాజపుత్రిక దిగంబరయై పిచ్చిపట్టినదానివలె దిరుగుచుండెనట. జైనమతగురువులెందరో చికిత్సలు చేసినను ఆబ్రమ్మరాక్షసుడు విడడయ్యెను.

రామానుజుడు బ్రహ్మరాక్షసుని పారద్రోలుట.

రామానుజుని మహాత్మ్యమును తన శిష్యుడగు తొండనూరునండి వలన రాజు భార్య శాంతలదేవి విన, రాజుతో జెప్పగా నతడు "మన పుత్త్రికి మనస్స్వాస్థమును గలిగించి యెప్పటి స్థితికి రామానుజుడు గొనివచ్చెనేని యతడే మనకు దైవము, అతడే ప్రభువు, అతడే గురువు” అని చెప్పి రామానుజునికి వార్తనంపించెను. రాజులయాశ్రయము మొదట రామానుజునికంతగా నిష్టము లేకపోయెనటగాని, మతవ్యాపనమునకు రాజుయొక్క సాహాయ్యమత్యావశ్యకమని శిష్యులు ప్రార్థించుటచేత నంగీకరించి రామానుజుడు రాజాంతఃపురమునకు బోయెను. అంతట రాజు తన రాణితో బ్రత్యుత్థానము చేసి యతనికి నమస్కరించి లోనికిగొనిపోయి కూతును జూపెను. దిగంబరయైయున్న రాజపుత్రికపై రామానుజుని పాదతీర్థమును గుర్వాజ్ఞ శిరసావహించిన శిష్యుడొకడు ప్రోక్షింపనామెనుబట్టియున్న బ్రహ్మరాక్షసుడు విడిచిపోయెనట. అంతట నామె మగవాండ్రయెదుట దానాస్థితిలోనుండుటకు సిగ్గుపడి చివాలునలేచిపోయి వస్త్రాలంకరణభూషితురాలయి వచ్చి వారలకు నమస్కరించి నిలువంబడెనట. తల్లితండ్రులు కొమార్తెనుజూచి పరమానందమునొంది రామానుజుడు నిజముగా నాదిశేషుడయిన యనంతునియొక్క యపరావతారమేయని విశ్వసించి యాతని మతమును స్వీకరించిరి. అంతట రామానుజుడు వారలనాశీర్వదించి విఠలదేవరాయనికి విష్ణువర్ధనుడని నామకరణము జేసెను. ఇట్లు విఠలుడు నూత్న మతకవచమును దొడిగి నూత్ననామమును స్వీకరించి జైనులయెడ ననురాగమును విడిచి వర్తించుచుండ జైనులకు రామానుజునియెడ ద్వేషమగ్గలమయ్యెను.