పుట:Andhrula Charitramu Part 2.pdf/40

ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము.

వైష్ణవ మతము.

దక్షిణ హిందూస్థానమునందు భక్తి ప్రధానమైన వైష్ణవమతము శఠకోపుడు, నాధముని, పుండరీ కాక్షుడు, రామమిశ్రుడు, యామునాచార్యుడు మొదలగు పరమ భాగవతోత్తములచే బోధింపబడుచుండుటచేత తక్కువ జాతివారనేకులు వైష్ణవ భక్తాగ్రేసరులై యున్నతస్థితికి వచ్చి భాగవతులచే బూజింపబడుచుండిరి. అయినను వైష్ణవమతము కూడ రామానుజులవతరించువరకు కర్మప్రదానమైన వైదికమతమునుగాని, వైరాగ్యప్రధానమైన శైవమతమునుగాని, మించి విశేషవ్యాప్తి జెందియుండలేదు.

శంకరమతము.

గౌతమబుద్ధుని తరువాత మతసంస్కర్తలలో జగత్ర్పఖ్యాతినొందిన శంకరుడెనిమిదవ శతాబ్దాంతమున మలయాళ దేశములోని కాలడి యను గ్రామంబుననొక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబమును నవతరించి బాల్యముననే వేదవేదాంతాది విద్యలనెల్ల గ్రహించి బ్రహ్మచర్యమునుండియే సన్న్యాసియై మహాతత్త్వవేత్తయై వ్యాసకృత వేదాంత సూత్రములకును, దశోపనిషత్తులకును, భగవద్గీతలకును మహాభాష్యములను వ్రాసి, ఆసేతుహిమాచల పర్యంతమును సంచారముచేసి, అద్వైతసిద్ధాంతమును బోధించుచు, పరమతఖండనమును స్వమతమండనమును జేయుచు, ధర్మవ్యవస్థకై భరతఖండంబున నుత్తర హిందూస్థానమున బదరీకేదారములోను, దక్షిణహిందూస్థానమున శృంగేరిలోను, పూర్వహిందూస్థానమున జగన్నాథములోను, పశ్చిమహిందూస్థానంబున ద్వారవతిలోను, నాలుగు ప్రధానమఠములనేర్పరిచి శంకరపీఠములను స్థాపించి, జగద్విఖ్యాతిగాంచెను. ఇతనిచే రచియింపబడిన సూత్రభాష్యమును, ఉపనిషద్భాష్యమును, గీతాభాష్యమును ప్రస్థానత్రయమందురు. హేతువాదమున నీగ్రంథమును మించినది మరియొక్కటి గానరాదని కొందరి తత్త్వవేత్తల యభిప్రాయము. ఇతడు బౌద్ధదర్శనములోని సిద్ధాంతములను బెక్కింటిని సంగ్రహించియు, బుద్ధుడు విష్ణువుయొక్క యవతార