పుట:Andhrula Charitramu Part 2.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

మంధకారబంధురమైన దండకారణ్యముగా నుండలేదనియు, ఆ కాలమునందీ దేశమును బరిపాలించుచు సర్వలోక పూజ్యులై తమ విశుద్ధ చరిత్రముచేత దమకీర్తిని లోకమెల్లెడల వ్యాపింపజేసినట్టి యర్కకుల కలశాబ్ధి శశాంకులెవ్వరో వారియుదంతమెట్టిదో వివరించుచు సమగ్రమైనట్టియు సప్రమాణమైనట్టియు స్వహస్తలిఖితమైన చరిత్రమును రామయ్యపంతులు గారాంధ్ర ప్రపంచమునకు గరుణించినయెడల మహోపకారమును జేసినవారగుదురు. అప్పుడా చరిత్రకారుడు తన యభిప్రాయమును మార్చుకొనుటకును సందియము లేదు.

చర్చలు

చరిత్రగ్రంథములలో చర్చలతోగూడిన భాగములుండిన బఠనీయములుగా నుండవని కొందరు చెప్పుదురు. ఇది కొంతవరకు వాస్తవమే కాని చరిత్రము వ్రాయబడకయున్న దేశముయొక్క చరిత్రము మొట్టమొదట వ్రాయునప్పుడు చర్చచేసి సందిగ్ధములుగ నున్న యనేకాంశములను సిద్ధాంతము చేసి స్థిరపరచిన గాని కాలనిర్ణయమునకు యదార్థకథనమునకు విషయవర్ణనమునకు గడంగిన చరిత్రకారుడు పరిహాసపాత్రుడగును. కాబట్టి మొదట వ్రాయబడు గ్రంథము విమర్శలతో గూడియుండక తప్పదు. ఇట్టి విమర్శిత చరిత్ర గ్రంథములు భావికాలపు చరిత్రకారుల కెన్ని విధములనో తోడ్పడగలవు.