పుట:Andhrula Charitramu Part 2.pdf/146

ఈ పుట ఆమోదించబడ్డది

మంతరించిన వెనుక నితడు స్వతంత్రుడై కాకతీయరుద్రమదేవికిని, కొంతకాలము కాకతీయ ప్రతాపరుద్రదేవ చక్రవర్తికిని ప్రత్యర్థిగనుండి క్రీ.శ.1314వ సంవత్సరము వరకు పరిపాలనము చేసి తుదకు, ప్రతాపరుద్రునిచే జయింపబడి రాజ్యము గోలుపోయినటుల గనబడుచున్నది. ఇతినికి బిమ్మట కాంచీపురము వరకు గల యావద్దేశమును ప్రతాపరుద్రుని సైన్యాధిపతి యగు ముప్పిడినాయకునిచే జయింపబడి కాకతీయసామ్రాజ్యమున జేర్చబడినది. ఇతడు తాను గావించిన దానములన్నియును నెల్లూరులోని శ్రీరంగనాయకస్వామి ఆలయమునకే చేయబడియుండుటచేత ఇతడు వైష్ణవమతావలంబకుడని చెప్పనగును. ఇతనితో విక్రమసింహపురచోడుల చరిత్రమంతరించినది.

తెలుగు పల్లవరాజులు

చాళుక్యచోడ సామ్రాజ్యము శిథిలమై దురవస్థలపాలగుచున్న కాలమున దెలుగుచోడులవలెనే ప్రాచీన పల్లవరాజవంశములలో జనించిన నవీన పల్లవరాజులు కొందరు తమ పూర్వులు గోల్పోయిన రాజపదవులను మరల సంపాదింపవలయునని ప్రయత్నపడినటుల గనుపట్టుచున్నది. ప్రాచీన పల్లవరాజుల చరిత్రమును నాయాంధ్రులచరిత్రములోని ప్రథమభాగమున విస్తరించియున్నానుగదా, ఆ పల్లవరాజుల సంతతివారు పెక్కండ్రు పూర్వ చాళుక్యచక్రవర్తులకును, చాళుక్యచోడ చక్రవర్తులకును లోబడినవ సామంతులుగనుండియు, బిమ్మట చాళుక్యచోడ సామ్రాజ్యముస్తమించు కాలమున గొంతవరకు స్వాతంత్ర్యమును వహించి తెలుగు చోడ రాజులతోను, కాకతీయసైన్యాధిపతులతోడను బోరాడుచు వచ్చి, తుదకు తెలుగుచోడులకును, కాకతీయులకును వశులై, తమతమ రాజ్యభాగములను కోల్పోయిరి. ఈ నవీన పల్లవరాజుల చరిత్రముగూడ తెలుగుచోడుల చరిత్రము వలెనే స్పష్టముగా దెలియంబడక చరిత్రకారులకు వేసటబుట్టించునదియై యున్నది. అయినను దెలిసినంతవరకు నిట సంగ్రహముగా వివరించుచున్నాడను. మొదటి కులోత్తుంగచోడ చక్రవర్తి బ్రదికియున్న కాలముననే అమ్మరాజను నామాంతరముగల