పుట:Andhrula Charitramu Part 2.pdf/145

ఈ పుట ఆమోదించబడ్డది

చేత రాజ్యపదవి బొందినటుల గనుపట్టుచున్నది. ఈ మొదటి మనుమగండగోపాలుని విక్రమసింహపురంబున దాను సింహాసన మెక్కించినటుల త్రిపురాంతకుని సోదరుడగు అంబదేవమహారాజు త్రిపురాంతకమున తనచే లిఖింపబడిన యొక దాన శాసనమున చెప్పుకొనియున్నాడు. రెండవ మనుమగండగోపాలుడు కాకతీయచ్రకవర్తిని రుద్రమదేవికి భృత్యుడై కాకతీయ సైన్యాధిపతులలో నొక్కడైయుండెను. ఇతడు నిర్వచనోత్తర రామాయణ కృతిపతియగు మనుమసిద్ధిరాజు యొక్క రెండవపుత్రుడును, రెండవ తిక్కరాజుసోదరుడు, నగు విజయాదిత్యదేవుని పుత్రుడని తోపుచున్నది. ఒక కాకతీయ సైన్యాధిపతి తాను యుద్ధరంగమున ఒక మనుమగండగోపాలుని సంహరించితినని చెప్పుకొనియున్నాడు. ఆ మనుమగండగోపాలుడు మొదటివాడో, లేక మఱియొక వంశములోనివాడో, భావి పరిశోధనమునగాని తెలియునదికాదు. మొదట రాజ్యమును పోగొట్టుకొని తరువాత కాకతీయ సైన్యాధిపతి యగు అంబదేవునిచే సింహాసనమెక్కింపబడిన మనుమగండగోపాలుని చరిత్రమును బురస్కరించుకొని సిద్ధేశ్వర చరిత్రమునందును, సోమదేవరాజీయమునందును, వక్కాణింపబడిన మనుమసిద్ధిరాజు యొక్కయు; అక్కనబయ్యనల యొక్కయు గాథ ఇటీవల గల్పింపబడినదేమో యని సందేహము కలుగుచున్నది.

రాజగండగోపాలదేవుడు

మనుమగండగోపాలునికి వెనుక విక్రమసింహపురాధిపత్యమును వహించినవాడు మధురాంతక పొత్తపిచోడ శ్రీరంగనాథుడు. ఇతనినే రాజగండగోపాలదేవుడందురు. ఇతని కాలమున గాంచీపురచోడులయొక్క యధికారము సంపూర్ణముగా నంతరించి పోయినందున నీతడు త్రిభువనచక్రవర్తియను బిరుదమును వహించెను. ఇతని శాసనములు గూడూరు, నెల్లూరు సీమలలో గానింపిచుచున్నవి. ఇతడు క్రీ.శ.1289-90వ సంవత్సరమున సింహాసనమెక్కినటుల శాసనములలో ఉదాహరింపబడిన పరిపాలన సంవత్సరములంబట్టి యూహింపదగియున్నది. కాంచీపుచోడుల యధికార