పుట:Andhrula Charitramu Part 2.pdf/116

ఈ పుట ఆమోదించబడ్డది

పతిదేవుని కొల్వుకూటమునవిన్పించినాడని విశ్వసించుటకంటె వింతవిషయము మరియొక్కటి యుండబోదు. కాబట్టి సిద్ధేశ్వరచరిత్రములోని విషయములను సమన్వయింపవలసిన పక్షమున నిట్లు సమన్వయింపవచ్చును. అక్కనబయ్యనలు నెల్లూరునుండి సిద్ధిరాజును బారద్రోలగా సిద్ధిరాజు కందుకూరుసీమలోని వెంట్రాలకోటలో జేరి యందు నివసించియుండును. ఆ కాలమున దిక్కనసోమాయజి గణపతిదేవునికడకుబోయి యాతనివలన మన్ననలను గాంచి, తన వచ్చినపని తెలుపగా నాతడు తన సైన్యమును బంపి అక్కనబయ్యనలను నెల్లూరునుండి పారద్రోలి మనుమభూపతిని బునరభిషిక్తుని గావించియుండును. తిక్కనభారతాఖ్యానమును విన్పించినాడనియు, తిక్కన బౌద్ధులను వాదము గెలిచినాడనియు, బౌద్ధులక్రూరమారణకర్మకు దిక్కనయొడంబడినాడనియు జెప్పుట కవికల్పితములని స్పష్టముగ జెప్పదగును. భావిపరిశోధనముల వలనగాని, మనకీవిషయముచక్కగా బోధపడజాలదు. మనుమసిద్దిరాజు బ్రతికియున్నంత వరకు స్వతంత్రుడై స్వల్పరాజ్యముతోనే తృప్తిగాంచి కాకతీయసైన్యాధిపతులతో బోరాడుచు జయాపజయములను గాంచుచుండెనని నా యభిప్రాయము.

కాటమరాజు మనుమసిద్ధిరాజుల యుద్ధము.

ఖడ్గతిక్కన పౌరుషపరాక్రమములు.

పసులమేపు బీళ్ళనిమిత్తమై కాటమరాజునకును మనుమసిద్ధిరాజునకును వివాదము పొసగి మహాయుద్ధము జరిగినటుల గాటమరాజుకథ వలన దెలియుచున్నది. ఈ యుద్ధకథనము ద్విపదలో రామరావణ యుద్ధముగ వర్ణింపబడినది. మనుమసిద్ధి రావణుడుగ బోల్పబడియెను. కాటమరాజు తండ్రి పెద్దిరాజు. పెద్దిరాజు తండ్రి వల్లురాజు. ఇతడాత్రేయ గోత్రోద్భవులయిన యాదవుల సంతతిలోని వాడుగ జెప్పబడియెను. ఇతడు కనిగిరిసీమలోని ఆలవలపాడునకధిపతిగ నుండెను, కాటమరాజు కనిగిరిసీమలోని యెర్రగడ్డ పాడున కధిపతిగ నుండెను. దేశమున ననావృష్టి సంభవింప యాదవులనం