ఈ పుట ఆమోదించబడ్డది

నర్థములు మూడుచున్నవి. దేశచరిత్రజ్ఞానము లేక పోవుటచేత విమర్శజ్ఞానము నశించిపోయి స్వప్రయోజనపరులై యెవ్వరే యసత్యమును బోధించినను గుణదోష పరిశీలనము చేయుశక్తిలేక తమ చెవిసోకిన దానినెల్ల నంధప్రాయముగా విశ్వసించి మూఢవిశ్వాసములలో మునింగి స్వతంత్రజ్నానములే యెవ్వరెట్లీడ్చిన నట్లు పోవుచుండిరి. దేశచరిత్రములున్న విమర్శ జ్ఞానము లభించును. దేశచరిత్రము సమగ్రముగా బఠింపని యేజాతియు నభివృద్ధిఁ బొందనేరదు. ఆంగ్లేయభాషా వాజ్మయమున స్వదేశచరిత్రములు మాత్రమేగాక యన్యదేశచరిత్రములను గూడ స్వభాషలో వ్రాసిపెట్టికొని యుండుటచే ఇంగ్లీషువారు నేఁటికాలమున బ్రపంచములో నాగరికాగ్రగణ్యులై యిప్పటియున్నతస్థితికి వచ్చియున్నవారు కావున దేశయుయొక్క పురోభివృద్ధికి దేశచరిత్ర మత్యావశ్యకమై యున్నది.

భరతఖండములోని యేదేశ చరిత్రమయినను వ్రాయుట సులభసాధ్యమగునుగాని యాంధ్రదేశముయొక్క పూర్వ చరిత్రమును వ్రాయుట బహుకష్టసాధ్యము. బహుకష్టసాధ్యంబగుటంజేసియె నట్టి పరీక్షాసిద్ధులయిన యాంగ్లేయ భాషాపండితులెవ్వరును దీని పొంతకు వచ్చినవారుకారు.

ఈ దేశచరిత్రము వ్రాయుటకుంగల సాధనము లత్యల్పములు; అనియు బహుగ్రంథపరిశోధనముఁ జేసినంగాని సులభసాధ్యములుగావు; వ్యయ ప్రయాసంబు లధికంబులు; మేధస్సునకుం గలిగెడుబాధ మెండు. ఇయ్యది కష్టముల కభ్యాసపడినవాఁడును, నిరంతర పరిశ్రమకోర్చువాడును జేయగలిగినపనికాని యెంతటిపండితుఁడయిన నన్యునకు సాధ్యము గాదు.