పుట:Andhrula Charitramu Part-1.pdf/50

ఈ పుట ఆమోదించబడ్డది

యున్నారు.[1] మరియును కాళిదాసుచే మేఘసందేశమునందు వర్ణించబడిన యక్షునినివాసస్థలమగు రామగిరి[2] యీ యాశ్రమప్రాంతముననే యుండెనని కొందరు విద్వాంసుల యభిప్రాయమై యున్నది.

సుతీక్ష్ణాశ్రమమునకుదక్షిణమున నాలుగుయోజనముల మీదననగా 120 మైళ్ళ మీదనగ స్త్యమహాముని భ్రాతయొక్క యాశ్రమముండెను. ఈ యాశ్రమము రాయపూరు జిల్లాయొక్క దక్షిణభాగమున బస్తరు సంస్థానం యొక్క యుత్తరభాగమున వ్యాపించి యుండెనని రామాయణములోని వర్ణనవలన మనమూహింపవలసి యున్నది. ఈ యాశ్రమమున దక్షిణమున నొకయోజనము (30 మైళ్ళు) మీద నగస్త్యాశ్రమముండెను. ఈ యాశ్రమము బస్తరు సంస్థానమునకు దక్షిణభాగమునం దుండెను. అగస్త్యాశ్రమనకు దక్షిణమున రెండామడల దూరమున ననగా నరువది మైళ్ళదూరమున బంచవటీ ప్రదేశమును గోదావరీ నున్నవి. పంచవటి కొంతవరకు నరణ్యప్రదేశమగుటం జేసి గోదావరి సమీపమున బర్ణశాల నిర్మించుకుని సీతారాము లక్ష్మణులు కొన్ని దినములు నివసించి యుండిరి. ప్రస్తుతపు గోదావరిమండలములోని భద్రాచలమునకు సమీపమున నున్న పర్ణశాలయను గ్రామములో శ్రీరాముని పర్ణశాలయుండెనని యాంధ్రుల యభిప్రాయమై యున్నది. రాముడు పంచవటిలో నుండగాశూర్పణఖ వచ్చి యాతని మోహించుటయు, లక్ష్మణుడు దానిముక్కు చెవులు గోయుటయు, ఖరాదిరాక్షసులను జంపుటయు మొదలుగాగల కథ యంతయు నడచినది ఈ ఖరాదులందరును జనస్థానమందుండిరి.

కావున నీజనస్థానమనునది యెద్దియో మనము దెలిసికొన వలసి యున్నది. మధ్యపరగణాలోని రాయపూర్ (రాయపురము) జిల్లా యొక్కయు బస్తరు సంస్థానం యొక్కయు బూర్వభాగము

సంబల్ పూరు (సంబళ పురము)

  1. Archeological Reports vol.XI
  2. (మేఘసందేశము 1 వ శ్లోకము).