పుట:Andhravijnanasarvasvamupart2.pdf/69

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సోమనాథ విరచితము లైన కృతు లనేకములు గలవు. బసవపురాణము, పండితారాధ్యచరిత్రము, అనుభవసారము, చతుర్వేదసార సుక్తులు, చెన్నమల్లు సీసములు, వృషాధిప శతకము తెలుగు గ్రంథములు; సోమనాథభాష్యము, బసవపంచగద్య, శ్రీరుద్రభాష్యము, నమస్కారగద్యము, అక్షరాంకగద్యము, ప్రపంచకప్రకారగద్యము, అష్టకము, పంచకము, ఉదాహరణయుగ్మము సంస్కృత గ్రంథములు; బసవరగడ, గంగోత్పత్తిరగడ, శ్రీ బసవాఖ్యరగడ, శ్రీ సద్గురురగడ కన్నడ గ్రంథములు.

సోమనాథుడు సంస్కృతాంధ్రకర్ణాటక భాషలందును వేదవేదాంగములందును మత సంప్రదాయాచారములందును మహాపండితుడు. ఆంధ్రకావ్య రచనమందును ప్రజాసామాన్యమునకు మతరహస్యములను వెల్లడి చేయుటయందును గల యభీష్టమును బసవేశ్వర పండితారాధ్య చరిత్రములును అనుభవసారమును వెల్లడి వేయుచున్నవి. సోమనాథుని కవిత్వము జానుతెనుగున ద్విపదపద్యములందు విరచిత మై జనసామాన్యమున కుపయోగపడగల విధమును బసవపురాణము, పండితారాధ్యచరిత్రము, అనుభవసారము మొదలగునవి తెలుపుచున్నవి. నన్నయకును, తిక్కనకును నడుమకాలమందు వర్ధిల్లిన సోమనాథు డాంధ్రవాజ్మయమునకును, విజ్నానమునకును, మతసాంఘికాచార సంస్కరణ సంరక్షణములకును చేసిన మహోపకారము నతని గ్రంథమును విశదము చేయుచున్నవి.

శ్రీ శంకరాచార్య విరచితమైన అపరోక్షానుభూతి ఆచార్య స్వాములవారి అద్వైతానుభవమును వివరించుచున్నట్లు, సోమనాథ విరచితమైన అనుభవసారము వీరశైవమతసారమును వివరించుచున్నది. శ్రీ శంకరాచార్యులు జైనబౌద్ధమతములను ఖండించి వైదిక మతోద్ధరణ మొనర్చినను ప్రజాసామాన్యమునందు వర్ణాశ్రమధర్మకర్మపరమైన వైదికమతవ్యాపనము దుస్తరమైనది. బసవేశ్వరుడు ప్రజాసామాన్యమునందు మానవధర్మపరమైన దైవభక్తిని వ్యాపింపజేయుటకై శివదీక్షాపర మైన వీరశైవమత వ్యాపనమునకు పూనుకొనెను; వైదికమతానుష్ఠానమునకు దురారాధ్యమైన కర్మమార్గమునకు బదులు సులభమైన భక్తిమార్గము నవలంబించెను. బసవేశ్వరుడు స్వయముగ బ్రాహ్మణకర్మములను విడిచి శివదీక్షను స్వీకరించెను. బసవేశ్వరు డవలంబించిన మార్గమును సోమనాథుడు విస్తరించజేసిన విధమును అతని గ్రంథములు విశదము చేయుచున్నవి. అనుభవసారమందలి యీ పద్యములు అతని సంకల్పమును తెలుపుచున్నవి.