పుట:Andhravijnanasarvasvamupart2.pdf/66

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనిరుద్ధుడు - 1. కల్పాదియందు బ్రహ్మను పుట్టించుటకై నారాయణు డెత్తిన యవతారము. 2. (చం. పం.) యాదవకులజుడు. శ్రీ కృష్ణుని కుమారు డైన ప్రద్యుమ్నునకును, రుక్మికూతురైన రుక్మవతికిని కుమారుడు. ఇతడు నాగాయుతబలుడు, మహారథుడు. రుక్మిరాజు పౌత్రి యైన రోచన యీతని భార్య. ఈ వివాహకాల మందు ఘోరమైన పోరు జరిగెను. ఈమె వలన నితనికి వజ్రు డను పుత్రుడు పుట్టెను (భాగ, 10. 90). బాణాసురుని కన్య ఉష యనునామె యీతని ద్వితీయ భార్య. ఈమెను గురించు యాదవులకును బాణాసురునకును పోరు జరిగెను.

అనిర్దేశము - యజ్న సంబంధి యైన యొక అగ్ని పేరు.

అనిలమధ్య - ఔడవ సంపూర్ణరాగము. 53 - వ మేళకర్తయగు గమనశ్రమరాగ జన్యము. ఆరోహణము : స రి మ ప ధ స; అవరోహణము : స ని ధ ప మ గ రి స యని సంచారము కలది.

అనిలుడు - 1. అష్టవసువులలో నొక్కడు. ఈ మన్వంతరమునందు వాయవ్యదిక్కునకు నధిపతి. ఈ శబ్దమునకు అనీలు డను రూపము గూడ గలదు. 2. శ్రీ కృష్ణునకు మిత్రవింద వలన గలిగిన పుత్రులలో నొక్కడు.