పుట:Andhravijnanasarvasvamupart2.pdf/49

ఈ పుటను అచ్చుదిద్దనక్కరలేదు

అనాహడ్‍గడతహసీల్ (లేక బర్నాలా) - ఇది పాటియాల సంస్థానము నందలి అనాహడ్‍గడనిజామతులోని ఒక తాలూకా. ఈ తాలూకా వైశాల్యము 346 చదరపు మైళ్లు. ఇందలి జనసంఖ్య 1.05,989. ఇందు అనాహడ్ గడము (జనసంఖ్య 6,905) హడియాయా (5,414), చాదరు (7,710) అను గ్రామములును, 96 పల్లెలును గలవు. ఈ తాలూకా 1,80,000 రూపాయలు చెల్లుచున్నది.

అమాజడ్‍గడనిజామత్ - పంజాబునం దున్న పాటియాల సంస్థానము నందలి ఒక జిల్లా. దీని వైశాల్యము 1,836 చదరపు మైళ్లు. ఇందలి జనసంఖ్య 3,77,363. ఇందు గోవిందగడము, ఛాదరు, బర్నాలా, హడియాయా అను నాలుగు గ్రామములును, 454 పల్లెలు నున్నవి. ఈ జిల్లాకు బర్నాలా, లేక అనాహడ్‍గడ మనునది ముఖ్యపట్టణము. ఈ జిల్లా 3,20,000 రూపాయలు చెల్లుచున్నది.

అనాహతము - ఆకాశము సకల బ్రహ్మాండములకును నాధారము. శబ్ద మాకాశమునకు వ్యక్తగుణము. విశ్వమునకు ఆకాశము వలెను, శబ్దమును విశ్వమున కాధారము. శబ్దము అనాహతము, ఆహతము అని ద్వివిధము.

' అనాహతం తు యచ్ఛబ్దం తస్య శబ్దస్య యత్పరమ్,
   తత్పరం విందతే యస్తు స యోగీ ఛిన్న సంశయః '
                    - ధ్యానబిందూపనిషత్తు.

అనాహతశబ్దమున కంటె పరమగు (శ్రేష్ఠమగు) నాదబ్రహ్మమును బొందిన యతడే సంశయరహితు డైన యోగి.