పుట:Andhraveerulupar025958mbp.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

ముగా బ్రత్యేకరాజ్యములను స్థాపించిరి. వారిలో వేమా రెడ్డి గణనీయుడు.

వేమారెడ్డివంశమునందు దొంతిఅల్లాడరెడ్డి మూలపురుషుడని స్థానికచరిత్రములందు గలదు. ఇప్పటిచరిత్ర కారులదృష్టిలోని కీతడు రాకపోవుటచే నీపేరుగలవాడు లేడను చున్నారు. చరిత్రాంశములతో నేకీభవించు స్థానికచరిత్రములకు బ్రాముఖ్యమీయక తప్పదుగాన గూటస్ధుడుగా దలంపబడు నీవీరుని చరిత్రము నెఱుంగుదము. దొంతి అల్లాడ రెడ్డి పంటరెడ్డి కులములో జనించినవాడు. నిజాము రాష్ట్రమునందలి చెదలువాడలో నీతడు వ్యవసాయము చేసికొని జీవించుచుండెను. ఒకనా డీరైతు భూమిదున్నుచుండగా లంకెలబిందెలు బంగారు నాణెములతో నిండినవి దొరకెను. గ్రామవాసులంద ఱాధనము హరింపవలయునని యత్నించు చుండుటచే రాజధానిగా నుండు అనుమకొండకుజేరి యచటనొక సువర్ణ వీరరాఘవ విగ్రహము చేయించి పూజించు చుండెను. అచ్చటగూడ గొన్నియపాయములు కలుగుచుండుటచే అల్లాడరెడ్డి ధనవస్తువాహనాదులతో కొండపల్లి సీమకువచ్చి కవులూరునందును ధరణికోటయందును బ్రాసాదములు గట్టించి సుఖముగా నుండెను. కొంతకాలమునకు దురదృష్టమున ఓరుగల్లు రాజ్యమును బరిపాలించు ప్రతాపరుద్ర చక్రవర్తిని తురకలు బంధించి డిల్లీనగరమునకు గొంపోయిరి. సామంత