ఈ పుట ఆమోదించబడ్డది

జంపుటయు జూడ గుణము గ్రహించుటయం దప్రతిమానుడనియు రాజనీతికొఱకై యెట్టి దురంత కార్యమునకు జంకువాడుకాడనియు దెలిసికొనవచ్చును. చాణక్యు డాంధ్ర బ్రాహ్మణుడని యాధునికులు విశ్వసించుచున్నారు. కాదనుటకు అగుననుటకు బలవత్తరములగు నాధారములు లభించువఱకు ననుమానమె శరణ్యము.

నాడు చంద్రగుప్తుని కైవసమాచరించిన మౌర్యరాజ్యము రూపుమాసినను జాణక్యుని ప్రశస్తిమాత్రము దేశీయులు మఱచిపోవలేదు. మహాత్ముల జీవితము లజరామరములై భవిష్యత్సంతతికి మార్గదర్శకములుగ నాచంద్రార్క స్థాయిగ నుండుననుటకు సంశయములేదు.

చంద్రగుప్తుడు రాజ్యమును బాలించిన కాలము క్రీస్తు శకమునకు బూర్వము 322 - 297 వఱకు నైయుండు నని చరిత్రములవలన దెలియుచున్నది. చంద్రగుప్తునికంటె జాణక్యుడు వయస్సున బెద్దవాడు గాన నతనికి గొంతముందుగ బ్రసిద్ధికివచ్చి చంద్రగుప్తునకు ముందె గతించి యుండును.

చాణక్యుని పాండిత్యమును విద్యాకౌశలమును గూర్చి విశేషించి వ్రాయవలసియున్నను, ఇందు వీరజీవితమును జేర్చుటయే మాసంకల్పముగాన నింతటితో విరమించు చున్నారము.

_______