ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంతోషప్రదమయ్యెను. బాల్యస్నేహితుడు శ్రీయుతమంతెన సుబ్బరాజుగారు తనతండ్రి జ్ఞాపకార్ధమై ఋగ్వేదభారమును వహించి కార్యలోపమురాకుండ రక్షించె. అధర్వ వేదమును పూనుకొన్న ఒకానొకస్నేహితుని కృషి ఈ కార్యసమాప్తికి తోడ్పడనున్నది. అనాదిగా ఈ వేదమంత్రములను పండితవ రేణ్యులు భద్రపరచియున్నారు. అందునిగూఢములైన భావపరంపరలు పండితపామరులకెల్ల సులభముగా బోధపడు నట్లు మధురమైనశైలిలో తేలికయైనపదములగూర్చి ఆంధ్రానువాదము జరుగుచున్నది. వేదవిమర్శకుల భావములును, ప్రకాశకుల స్వంతభావములును ప్రత్యేక సంపుటములలో తెలుపబడును. కరుణామయుని అపారమైన అనుగ్రహముచేతనే సనాతనులైన పండితులు యీ అనువాదమునకు పూనుకొనిరి. ఋగ్వేదమును సుప్రసిద్ధసంస్కృతాంధ్రపండితులును, సంస్కర్తలును, పురాణవాచస్పతి బిరుదాంకితులును నగు బ్రహ్మశ్రీ జంకుపల్లె మల్లయ్యశాస్త్రిగారు ఆంధ్రీకరించియున్నారు. సామ, అధర్వ వేదములను వారే అనువదింతురు. సాహిత్యశిరోమణి బ్రహ్మశ్రీ రామవరపు కృష్ణమూర్తి శాస్త్రిగారు కృష్ణయజుర్వేదమనువదించిరి. శుక్ల యజుర్వేదమును గూడ అనువదింతురు.

ఆంధ్రవేదప్రకటనకు అనివార్యములైన చోటతప్ప స్వదేశవస్తువులనే వాడుచున్నాము. యుద్ధకాలమగుటచేత వస్తువుల ధరలు పెరుగుటయు, వస్తువులు సులభముగా లభింపకుండుటయు కొంత ఆటంకమును కల్పించుచున్నవి. మూడేండ్లనుండి మురియుచున్న ప్రకటన అంతరాయములచే అప్పటప్పటికి ఆలస్యమగుచుండెను. కాని పరుచూరు ప్రాంతవాసులు మా ఆలస్యమునకు జంకక, మా వాయిదాలను నిరసింపక, వేలకొలదిగా ధనమిచ్చి ఆదరాభిమానములతో తోడ్పడుటచేతనే ఈపని యిప్పటికి సాధ్యమైనది. ఆంధ్రవేదములు సంపూర్తియగుసరికి కొన్నియేండ్లుపట్టును. ఆంధ్రులందరును, ఆరంభశూరులుగాక సుస్థిరసమగ్రోత్సాహముతో ఈ కార్యక్రమమునకు తోడ్పడుదురుగాక యని ఆశించుచున్నాము.