పుట:Andhra bhasha charitramu part 1.pdf/847

ఈ పుట ఆమోదించబడ్డది

నాతడు తన శిరోజములను కపర్దాకారముగ జుట్టికొనియుండుట యసంభవము కాదు. అర్జునుడు తెగబారెడు వెంట్రుకలవాడు కావున వానిని కపర్దాకారమున జుట్టుకొనుట సహజమే. కావున, 'కవ్వడి' పదము 'కపర్ది' శబ్దభవమని చెప్పుటయే యుక్తమని తోచుచున్నది. ప్రాకృతమున 'కవ్వాడ' అను మఱియొక పదము గలదు. దీనికి 'ఎడమచేయి' అని యర్థము; 'కవ్వాడి' అనగా బ్రాకృతమున 'ఎడమచేతివాడు' అను నర్థము కలుగును. అర్జునుని సవ్యసాచిత్వము వలననే యర్జునునికి తెనుగున 'కవ్వడి' యనుపేరు గలిగినదని సాధింపనెంచువా రీ ప్రాకృతము నాధారముగ దీసికొనవచ్చును; 'కవ + వడి' అని తెనుగున బహువ్రీహిసమాసమును కల్పించుకొన నక్కఱలేదు.

2. వడముడి.

కేశరచనను బట్టియే యర్జునునకు గవ్వడి యను పేరు కలిగినదని చెప్పుటకు భీమునికి 'వడముడి' యను పేరుండుట యుపబలముగా నున్నది. 'వడముడి' యనగా కుడిప్రక్క శిరోజముల ముడిగలవాడని యర్థము. 'వడ' 'వల' కు రూపాంతరము. 'వల' యనగా కుడిప్రక్క. చూ. వలకేలు = కుడిచేయి; వలపల = కుడిప్రక్క; మొదలయినవి.

3. ఐదువ.

'ఐదువ' అనుపదమునకు శబ్దరత్నాకరమున కర్థమిట్లు వివరింప బడియున్నది. "ఐదువ. ద్వ. వి. (ఐదు + వన్నెలు గలది.) మాంగల్యము గలస్త్రీ (వన్నెయనగా ఇక్కడ సుమంగలియొక్క అలంకారము. ఐదేవనగా. - మంగళసూత్రము, పసుపు, కుంకుమము, గాజులు, చెవ్వాకు.) అయిదువ యొక్క రూపాంతరము." అని. ఈ వ్యుత్పత్తి సరియైనట్లు తోపదు. 'వ' అనునది 'వన్నె'కు సంక్షేపరూపముగ మఱియెచ్చటను సమాసములందును గానరాదు. పైని వివరించిన యైదును సుమంగలి కలంకారములని యేధర్మశాస్త్రమును వివరించి యుండలేదు. జనులవాడుకలో నవి సుమంగలి కలంకారములుగ బరిగణింప బడుచున్నను నట్లు పరిగణింపబడు కాలివ్రేళ్ల మట్టెలు మొదలగు మఱికొన్నియు గలవు.

అఱవములో 'ఐ' అనగా 'అందమయిన' అనియు, 'ఐదు' అనగా అందముగలది యనియు నర్థము లున్నవి. 'ఐదువు'న కీవ్యుత్పత్తిని జెప్పినచో దాని కందకత్తె యనునర్థము వచ్చునుగాని తెనుగున గల యర్థము కలుగదు.

ప్రాకృతమున 'అఇదుఅ', 'అయిదుఅ', 'అయిదువ' అను పదములు గలవు. అవి 'అవిధవా' శబ్దభవములు. తెనుగుననున్న 'ఐదువ' కూడ 'అవిధవా' శబ్దభవ మగునేమోయనియు, ప్రాకృతపదమే తెనుగున నట్లే యుపయోగింపబడుచున్నదనియు ననుకొనుట యుక్తమని తోచు