పుట:Andhra bhasha charitramu part 1.pdf/752

ఈ పుట ఆమోదించబడ్డది

(2) షష్ఠ్యంతపదము 'యాజక' మొదలగు పదములతో గలిసి షష్ఠీతత్పురుష సమాసమగును. యాజక, పూజక, పరిచారక, పరివేదిక, పరిషేవక, స్నాపక (స్నాతక), అథ్యాపక, ఉత్సాహ (-ద) క, ఉద్ధర్తక, హోతృ, భర్తృ, రథగణక, పత్తిగణక, పోతృ, హర్తృ, వర్తక - ఇవి యాజకాదులు. ఉదా. బ్రాహ్మణుని యాజకుడు = బ్రాహ్మణయాజకుడు; దేవపూజకుడు మొదలయినవి.

షష్ఠ్యంతపద మాపదమునం దంతర్భూతమై గుణమును దెలుపు పదముతో గలిసి షష్ఠీతత్పురుష సమాసమగును: ఉదా. బ్రాహ్మణవర్ణము, చందనగంధము మొదలయినవి.

అట్లే, యది విశేషణముల 'తర' భావమును దెలుపు పదముతో సమసించియు షష్ఠీతత్పురుష సమాసమగును: ఉదా. అన్నిటికంటె శ్వేతతరము = సర్వ శ్వేతము మొదలయినవి.

కృదంత పదముతోడి సంబంధమువలన నొకపదమునకు షష్ఠీ ప్రత్యయము చేరునపుడు, అ షష్ఠ్యంతపద మాకృదంతపదముతో సమసించి షష్ఠీతత్పురుష సమాసమగును: ఉదా. ఇధ్మవ్రశ్చనము = ఇధ్మములను (కట్టెలను) వ్రశ్చనము (చీల్చునట్టిది) = గొడ్డలి.

(3) నిర్ధారణార్థముగల షష్ఠ్యంతపదము మఱియొకపదముతో సమసింపదు. 'నరులలో ద్విజుడు శ్రేష్ఠుడు' అనవలెనుగాని 'ద్విజుడు నరశ్రేష్ఠుడు' అని సమాసము చేయరాదు.

(4) షష్ఠ్యంతపదము పూరణార్థక పదముతోడను, గుణవాచకముతోడను, నుహిత, సత్, అను నర్థములుగల పదములతోడను, అవ్యయముతోడను, తవ్యప్రత్యయాంత పదముతోడను, సమానాధికరణముతోడను, సమసింపదు. "ఉన్నవారిలో ఆఱవవాడు" అనునర్థమున 'సత్ షష్ఠుడు' అనకూడదు. 'కాకినలుపు' అనునర్థమున 'కాకకార్ష్ణ్యము' అనకూడదు. 'ఫలమునకుతృప్తుడు' అనునర్థమున 'ఫలతృప్తుడు' అనకూడదు. 'ఫలముచేత తృప్తుడు' అని తృతీయతో జేరునపుడు 'ఫలతృప్తుడు' అనవచ్చును. తృతీయా సమాసమయినప్పుడు సమాస మాద్యుదాత్తస్వరము కలది; షష్ఠి చెప్పునపు డంత్యోదాత్తస్వరము; 'బ్రాహ్మణునికి పనిచేయువాడు' అనునర్థమున 'బ్రాహ్మణకుర్వాణుడు' అనకూడదు; 'బ్రాహ్మణునికిచేసి' అనునర్థమున 'బ్రాహ్మణకృత్వా' అనకూడదు. 'బ్రాహ్మణుని కర్తవ్యము' అనునర్థమున 'బ్రాహ్మణకర్తవ్యము' అనకూడదు. ('తవ్య' ప్రత్యయాంతమయినప్పుడు సమాసము కలుగదుగాని, 'తవ్యత్‌' ప్రత్యయాంతమయినచో సమాసము సిద్ధించును: ఉదా. బ్రాహ్మణ