పుట:Andhra bhasha charitramu part 1.pdf/626

ఈ పుట ఆమోదించబడ్డది

పైని వివరించిన భాషావిభాగచరిత్రము భారతవర్ష చరిత్రమును, నా యా పూర్వప్రాకృతభాషల లక్షణమును, నే డాయాప్రాంతములందు నెలకొనియున్న భాషలలక్షణము ననుసరించి యున్నది. భాషాశాస్త్ర విషయముల నింతకంటె నెక్కువ నిశ్చయముగ జెప్పవీలులేదు. భాషాశాస్త్రమున దక్కిన భౌతికశాస్త్రములందువలె బ్రత్యక్షప్రమాణములు మిక్కిలి కొంచెముగ నుండును. కావున నీ విషయమున ననుమానమే ప్రధానప్రమాణమగుచున్నది. ఆయాభాషాలక్షణములు కాలము గడచినకొలదియు జాడలుగ మాత్రము మనకు గోచరించుచుండును. ఆ జాడలనుబట్టి యూహించినచో ద్రావిడభాషలయందు పైశాచీప్రాకృతభాషాలక్షణములు కొన్ని పొడగట్టుచుండును. ఆపైశాచీలక్షణము లాంధ్రభాషయందు సుస్పష్టముగ గాన్పించుచున్నవని మాత్ర మిప్పటికి దెలిసిన పైశాచీభాషా లక్షణమునుబట్టి చెప్పగలము. లాక్షణికులు తెలిపిన యా లక్షణములను వివరించి యవి యాంధ్రమున నెంతవఱకు గలవో విచారింతము.

ఆంధ్రభాషయందలి పైశాచీలక్షణములు.

(1) సం. జ్ఞ = పై. ఞ్ఞ; ప్రజ్ఞా=పఞ్ఞా; సంజ్ఞా=ఞ్ఞా; సర్వజ్ఞ:=సవ్వఞ్ఞో; జ్ఞానమ్=ఞ్ఞానం; విజ్ఞానమ్=విఞ్ఞానం (హేమ. 8. 4. 303, ప్రా. పు. V. 9=ఞ్జ; ప్రా. సర్వ. పు. 124 కేకయపైశాచీలో వైకల్పికము; ప్రా. క. కైకేయీపైశాచిలో నిత్యము).

తెనుగున పై. 'ఞ్ఞ'='౦య', 'య్య' లుగామాఱినది. సంజ్ఞా=పై.సఞ్ఞా=తె. సమ్యా (ట), సయ్యాట. సర్వజ్ఞ=పై. సరవఞ్ఞ=తె. సరవయ్య, సరయ్య (మనుష్య సంజ్ఞావాచకములు) సం. ఆజ్ఞాకార=పై. ఆఞ్ఞాకార=తె. ఆయకాడు; పైశాచీలో 'ఞ్జ' కూడ 'ఞ్ఞ' గ మాఱి యుండవచ్చును. ఉదా. లంజ=* పై లఞ్ఞ=తె. లయ్య; వంధ్యా=ప్రా. వంజ్ఝా=పై. వఞ్ఞ=తె. వయ్య (ము).

(2) సం. రాజ్ఞా, రాజ్ఞ:, రాజ్ఞి=పై. రాచిఞా, రఞ్ఞా; రాచిఞో. రఞ్ఞో; రాచిఞి, రఞ్ఞి; (హేమ. 8. 4. 304; ప్రా. పు. X. 12; ప్రా. రూ, XX. 9; ప్రా. సర్వ. పు. పు. 124 కేకయపైశాచి; రన్నా, రన్నో, రన్ని, అను రూపములును గలుగును; ప్రా. క. కైకేయీ పైశాచీలో రాజ్ఞా, రాజ్ఞ:, రాజ్ఞి=రాచినా, రాచిన, రాచిని, అని నిత్యముగా నగును.

తెనుగున 'గాయ' అను తద్భవము పై. ఞ్ఞ=తె య్య అను మార్గమున గలిగియుండవచ్చును. లేదా, రాజన్, శబ్దమందలి జ=చ=య, అను మార్గమున నైనను గలిగి యుండవచ్చును.