పుట:Andhra bhasha charitramu part 1.pdf/41

ఈ పుట ఆమోదించబడ్డది

సారముగ నింకను నెక్కువగ భాషనుగూర్చి పరిశ్రమచేసి యుందును. రామమూర్తి పంతులుగారికిని నాకును బ్రధాన విషయమగు ద్రావిడభాషలకును నార్యభాషలకును గల సంబంధమును గూర్చి యభిప్రాయ భేధము గలదు. నా వాదమును వా రంగీకరింపరని నాకు దెలియును. కాని, యా విషయమున నేను సేకరించిన సాక్ష్యమునంతటి నొకచో జేర్చి చూపియున్నాను. అది సరిపోయిన సరిపోవు గాక; సరిపోకున్న నింకను నా విషయమున నెక్కువ కృషి జరుగవలసి యున్నదని మాత్రము చెప్పవలసియుండును. తమతమ వాదములే గెలువవలె నను పట్టుదల తత్త్వైకదృక్కుల కుండగూడదు. ఉన్న విషయములను పరామర్శింపక విడిచిపెట్టను గూడదు. వారీ విషయమున నేను చూపిన సాహసమునకు హర్షింతురనియే నా నమ్మకము.

ఈ గ్రంధమున వివాదగ్రస్తములగు ననేక విషయములను గూర్చిన చర్చలు గలవు. అనేకులు నా యభిప్రాయములతో నేకీభవింపరని నాకు దెలియును. కాని, యాయా విషయములను గూర్చి వ్యక్తిగతముగ గాక నిష్పక్షపాతముగ విమర్శింతురు గాక యని ప్రార్థించుచు పండితమండలి కంజలి యెత్తుచున్నాను. ఇందు లోపములును దోషములును లేవని తలంచునంతటి వెఱ్ఱినిగాను. లోపములున్నవి. దోషములు నున్నవి. ఆంధ్రభాషా చరిత్ర నిర్మాణమున కిది ప్రథమ ప్రయత్నము. మున్ముం దెవ్వరైన నీ మార్గమున బనిచేసి యింతకంటె బ్రామాణకమును సమగ్రమును నగు గ్రంధమును వ్రాయుట కిది దారియగును గదా యని సంతోషించుటకు మాత్రము నాకు స్వేచ్ఛకలదని మనవి చేసికొనుచున్నాను.

ఆంధ్రభాషాచరిత్రమున దెలుపవలసిన విషయము లింక నెన్నియో యున్నవి. ఇప్పటికే గ్రంధము విస్తరించుటచేత నెన్నియో విషయములను జేర్పజాల నైతిని. గ్రంధములోని కెక్కక మిగిలి పోయిన ప్రయోగసామగ్రిని నితర విషయములను నికముం దెన్నడైన వేఱు సంపుటమున పొందుపఱచుకొందును.

ఈ గ్రంథమును వ్రాయుటకు నాకు దోడ్పడిన గ్రంథము లనేకములు గలవు. వాని నా యా సందర్భములందు తెలిపియే యున్నాను. వానికి వాడిన సంక్షేప సంకేతములు సులభముగనే తెలియును గావున, వాని పట్టికను బ్రత్యేకముగ జేర్పలేదు.

ఈ గ్రంథమును వ్రాయుటకు నన్ను బ్రేరేచినవారు డాక్టరు కట్టమంచి రామలింగారెడ్డి, ఎం. ఏ. (కేంటబ్), డి. లిట్. గారు. ఆంధ్ర విశ్వ