పుట:Andhra bhasha charitramu part 1.pdf/239

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రలిపి.

భాషాచరిత్రమునకు లిపిచరిత్రముతో నంతగ సంబంధములేదు. భాషయనున దుచ్చరింపబడు నర్థవంతములగు ధ్వనుల సమూహము. లిపి యాధ్వనులను దూరముగ నుండువారికిని, రహస్యముగ వానియర్థము దెలిసికొన నెంచువారికిని, కాలాంతరమున నా లిపిమూలమున నాయా ధ్వనులను పోల్చికొని వాని యర్థమును గ్రహింపనెంచువారికిని నుపయోగించుటకై యా యా భాషలను మాట్లాడు సంఘముల వారేర్పఱుచుకొను కొన్ని లిఖిత సంకేతముల సముదాయము. లిపి ధ్వనులను సంపూర్ణముగ దెలుపజాలదు. అది వానిని స్థూలముగ దెలుప జాలునేకాని, తత్తద్వాగింద్రియ స్థానములందు సరిగ నా యా ధ్వనులు పుట్టనప్పుడు గలుగు సూక్ష్మధ్వని భేదములు దానివలన స్పష్టపడవు. భాషలయందు గలుగు మార్పుల కా యా స్థానములందు గలుగు సూక్ష్మభ్రంశమే కారణము. ధ్వనులు రానురాను మాఱుచుండ, లిపియంత శీఘ్రముగ మాఱకుండుటచే గొంతకాలమున కేలిఖితాక్షర మే ధ్వనికి గుఱుతుగ బూర్వు లుపయోగించికొనిరో తెలిసికొనుట కష్టమగు చుండును. కాని, యాంధ్రమువంటి భాషలలో వ్రాతక్రమము సాధారణముగ ధ్వనుల ననుసరించుచుండుటచే నంతటిచిక్కులు కలుగకుండును. 'లచ్చన్న' అని వ్రాయునప్పుడు 'లత్సంన్న' యనియు, 'జ్ఞానము' నకు 'గ్జ్ఞాన' మనియు బండితులు కానివారు వ్రాయుచుందురు. వారివ్రాత యుచ్చారణము ననుసరించి యున్నదని చెప్పవలయును. ఆంధ్ర లిపియందు దంత్యతాలవ్య 'చ, జ' లకు ప్రత్యేకసంజ్ఞలు లేకపోవుటచే సాధారణు లుచ్చారణము ననుసరించియే వానిని వ్రాసికొందురు. శాసనములలో నచ్చటచ్చట నిట్టి వర్ణక్రమము కాననగును.

ఈ గ్రంథమునం దాంధ్రలిపి చరిత్ర మనావశ్యకమైనను దానిని సంగ్రహముగ నీక్రింది పట్టికమూలమున దెలుపు టుచితము కాకపోదు. మొదటి పటమునుబట్టి భారతీయ భాషాలిపులన్నియు నేరీతిగ నాదిమౌర్య లిపినుండి వికారము నొందినవో వానివలన దెలిసికొనవచ్చును. రెండవ పటమున దాక్షిణాత్యలిపుల వంశక్రమము తెలుపబడి యున్నది.