పుట:Andhra bhasha charitramu part 1.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

iogy) యొక శతాబ్దమునుండియు కృషి జరుగుచున్నను, నిప్పటికి నిట్టి ప్రశ్నలకు సరియైన సమాధాన మిదియని చెప్ప వీలులేదు. గ్రీసుదేశములో భాషస్వాభావికమనియు (phusei), సాంకేతికమనియు (thesei) వాదించువారు రెండుపక్షములుగా నేర్పడి ఘోరముగా వాదములు చేసినారు. సోక్రెటీసను తత్త్వవేత్త శబ్దమునకును వస్తువునకును స్వాభావికమైన సంబంధ మేమియులేదని యొప్పుకొన్నను, నట్టి స్వాభావికసంబంధముగల భాషయొకటియావశ్యకమని యభిప్రాయపడినాడు. ఈ యభిప్రాయము ననుసరించియే బిషప్పు విల్కిన్సు మొదలయిన నవీనులు తాత్త్వికభాషానిర్మాణమునకు బ్రయత్నములు చేసినారు.

పైని చెప్పబడిన వాదము లెంత మనోహరముగా నున్నను, నవిశాస్త్రీయములని చెప్ప వీలులేదు. భాషావిషయముల నొకచోటజేర్చి, వానిని వర్గీకరించి, అందువలన తేలిన సామాన్యసూత్రముల నేర్పరించుటయే భాషా శాస్త్రము చేయవలసిన పని. గ్రీకు వైయాకరణు లట్టిపనిని చేయలేదు. శాస్త్రీయముగా భాషావిషయమై తత్త్వదృష్టితో నాలోచించినవారు ప్రాచీనభారతవర్షీయులు. ప్రాచీనవేదభాష కొన్నిపట్టుల దుర్గ్రాహమయ్యెను; కాని, వేదమతప్రాబల్యముచేత మంత్రములలోని యొక మాత్రమయినను తప్పకుండ, తరువాతి తరములవారు వేదములను కాపాడుకొనుచు వచ్చినారు. స్వల్పవిషయములలో గూడ వేదములలో నెట్టివ్యత్యాసమును కలుగ లేదు. ఇందువలన ధ్వనులను సంస్కృతవైయాకరణులు స్థాన, కరణ, ప్రయత్నాది భేదములతో వర్గీకరణముచేసి, వ్యాకరణరూపముల నద్భుతముగా నేర్పరించి, కృత్రిమమును సాంకేతకమును నయినను, నల్పాక్షర త్వాసందిగ్ధత్వాది నియమములతో నాశ్చర్యకరముగ భాషాశాస్త్రమును రచించినారు. ఈప్రాచ్యపద్ధతికిని పాశ్చాత్యపద్ధతికిని చాల భేదమున్నది. పాణిన్యాదుల గ్రంథములను పఠించిన పాశ్చాత్యుల కీపద్ధతి యద్భుతావహమైనది. అందుచేతనే, సంస్కృత వ్యాకరణ సంజ్ఞలను పాశ్చాత్య భాషాశాస్త్రజ్ఞులు కూడ గొన్నిటి నవలంబించి యిప్పటికిని వానిని విడువలే కున్నారు.

ఐరోపాఖండములో భాషాశాస్త్రము మొదట గ్రీసుదేశములోను, తరువాత రోములోను చాల మందముగా నభివృద్ధి పొందినది. ఆరిస్టాటిలు మొట్టమొదట భాషాభాగముల నేర్పాటుచేసి, విభక్తియను నూహను బయలు పఱచినాడు. ఈత డారంభించినదానిని స్టోయికులు (stoics) అను తత్త్వవాదులు సాగించినారు; వీరు కల్పించిన వ్యాకరణ విభాగములను, సంజ్ఞలను తరువాతివారు కూడ నవలంబించినారు కాని, యా సంజ్ఞలు లాటినుభాషలో నుండుటచేత, వానికి తప్పు టర్థములను కల్పించినారు. 'జెనికె' (genike)