ఆదిభట్ట నారాయణదాస కవి
1864 - 1945
పేరూరు ద్రావిడ శాఖీయ బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రుడు. తల్లి: లక్ష్మీ నరసమాంబ. తండ్రి: వేంకటచయనులు. జన్మస్థానము: అజ్జాడ గ్రామము. నివాసము: విజయనగరము. పుట్టుక: 1864 ఆగష్టు 31 వ తేదీ. నిర్యాణము: 1945 జనవరి 3 వ తేదీ. ముద్రిత గ్రంథములు: హరికథలు:- 1. జానకీశపథము 2. రుక్మిణీ కల్యాణము 3. అంబరీష చరిత్రము 4. హరిశ్చంద్రోపాఖ్యానము 5. భీష్మచరిత్రము 6. గజేంద్ర మోక్షము 7. మార్కండేయోపాఖ్యానము 8. ప్రహ్లాద చరిత్రము 9. సావిత్రీ చరిత్రము 10. ధ్రువోపాఖ్యానము 11. యదార్థ రామాయణము 12. భగవద్గీత [వేల్పుమాట] శతకములు:- 13. రామశతకము 14. శివశతకము 15. ముకుంద శతకము. 16. మత్యుంజయ శతకము 17. సూర్యనారాయణ శతకము 18. సత్యవ్రత శతకము 19. నూరుగంటి 20. వేల్పువంద 21. బాటసారి [కావ్యము] 22. నవరస తరంగిణి (షేక్సుపియర్, కాళిదాసకవుల కవిత్వపు సొగసులు విమర్శించునది) 23. పురుషార్థబోధిని 24. ఉమర్ ఖయామ్ (పారశీక కృతికి సంస్కృతాంధ్రములలో పరివర్తనము) 25. బుక్సం గ్రహము (తెలుగులో సంగీత కృతి) 26. వెన్నుని వేలుపేరుల వెనుకరి (విష్ణుసహస్రనామ సంకీర్తనమునకు దెలుగుసేత) సంస్కృతభాషలో:- 1. కాశీ శతకము 2. రామచంద్ర శతకము 3. శ్రీకృష్ణ కథామృతము (సంస్కృతభాషలో హరిగాథ) 4. తారకమ్ (కావ్యము)
ప్రఖ్యాతపురుషుల జాతకములు బహువిచిత్రముగ నుండును. సాధారణముగ జిన్ననాట బడరానిపాట్లు పడినవారు పెద్దతనమున విడుపు లేని విభవము లనుభవించుట చూచుచున్నాము. విశ్వఖ్యాతి నార్జించిన నేటి దేశనాయకుల, నేటి మహాకవుల, నేటియుత్తమపురుషుల జీవిత చరిత్రములు చదివికొన్నచో మన కీవిషయము నిస్పష్టమగును.