దలచి పదములు ప్రామాణిక గ్రంధములనుండి యెత్తివ్రాసికొని యచ్చటచ్చట గొన్నిపదముల కర్థనిర్ణయము చేసికొని యీమహోద్యమము తుద ముట్టకుండగనే పరమపద మలంకరించిరి. వారియనంతరము సీతారామాచార్యులవారు సంస్కృతాంధ్రపదములు తదర్థములు కొన్నిప్రయోగములు చేర్చి శబ్దరత్నాకరము సంధానించిరి. ఇది 1885లో వెలువడినది. శబ్దరత్నాకరము తరువాత 'శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు' వెలువడిన విషయము తెలుగువారికి దెలిసినదే.
చిన్నయసూరి వెనుక లాక్షణికులలో సీతారామాచార్యులుగారు ముఖ్యులు. ఈయన సూరికి శిష్యుడ నని వ్రాసికొనలేదు. కాని శిష్యుడైనట్లు జనశ్రుతి. ఆచార్యుల వారు కొండొకచో నిటులనుచున్నారు. "ఫరవస్తు చిన్నయసూరిగారి కాంధ్రమునందును దదుపయుక్త సంస్కృత ప్రాకృతములయందును దలస్పర్శియగు పరిజ్ణానము కలదని వారుచేసిన లక్ష్యలక్షణగ్రంధములే నిరూపించుచున్నవి. మేము వారితో జిరకాలము సావాసము చేసియుంట వారిపాండిత్యము మాకనుభవసిద్ధము." ఇది చూచి వీరి శైష్యోపాధ్యాయిక తెలిసికొన వచ్చును.
ఆచార్యులవారు పండితోత్తముడు సజ్జనాగ్రేసరుడునగు తమ తండ్రిగారికడ విద్యాభ్యాసము చేసిరి. కవితారసథార యథోచితముగ బసినాటనే కలిగినది. అప్పుడు బాలవయోవష్టాకాల వాసస్థానమైన నాగపట్టణములో నున్న సౌందర్యరాజ స్వామిపై శబ్దాలంకారభరితమైన శతక మొకటి రచించిరి. ఈ శతకము శతక కవిచరిత్ర కారులకు దొరికినది. కవిత ప్రాధమికమైనను నిటులు మాధురీభరితముగ నున్నది.
హరశూల నామశరదా
శరదాసితగాత్ర భక్తజనహితసరదా !
వరదామరుచిర సురదా
మరక్షాస్య మహిత సురాజ సుందరరాజా !