ఈ పుట ఆమోదించబడ్డది

పదవయేట సహజముగ గవితాధారయలవడినది. అచ్యుతపురాగ్రహారములో జిన్నతనమునాటి యొకవృత్తాంత మిట్లు చెప్పుదురు. అప్పన్నయను కుట్టుపనివాడు పట్టుగుడ్డతో నొకసంచి కుట్టి యమ్మకమునకు దెచ్చెను. ఈయాచార్యకవి బాలుడు దాని నాసించెను. కాని చేత గానిలేదు. తక్షణమే యీపద్యము వానిపై నాశువుగ జదివెను.


మునియాగరక్షకుండును

మునిపత్ని రక్షకుండు మోదముతోడన్

నిను గనుగొని ప్రోచుసుమీ

జరిజీ అప్పన్న నామ ! సద్గుణధామా !


చదువుకొన్నకుఱ్ఱ డని అప్పన్న సంతోషించి సంచి పట్టుకపొమ్మనెను. ప్రాసము పోయినదని యత డెఱిగిన సంచి యీయకపోయియుండు వాడు.


క్రమముగా నరసింహాచార్యకవి పండితుల తలలూపించు కవిత్వము వ్రాయ మొదలిడెను. పఠనీయములగు సంస్కృతాంధ్ర గ్రంథము లధికరించెను. శాస్త్రపాండితిని సంపాదించెను. కంఠము మంచి దగుట సంగీతముకూడ నేర్చెను.


వావిలివలస ప్రభుని దర్శించుట కొకప్పు డాచార్యులు పయనమైరి. ఆ దొరపేరు సీతారామయ్య. కవు లనిన నా ప్రభువున కభిమానము. ఆయనను దర్శించి నరసింహాచార్యు డీపద్యము చదివెను.


వెండికొండకు నీకీర్తి వెలిగలీబు

పాలకడలికి మీగడ పవికి దళుకు

శశికి దనకందుమానుప జాలుమందు

కొన డదేలొకొ శ్రీరామకువలయేశ


ఇదివిని రాజు రసికుడగుట నరసింహాచార్యుని తన యాస్థానకవిగ నుండ నడిగించెను. ఇత డిది యంగీకరింపక యిట్లు చెప్పెను. "నేను కొంతకాలము క్రితము శ్రీ విజయనగరము మహారాజు విజయరామగజపతి వేటకై యడవి కేగుచు పాలకొండ గ్రామమున విడిసినపుడు