ఈ పుట ఆమోదించబడ్డది

పదేండ్లపాటు సభ్యులై జాతీయ ప్రభొధము గావించినారు. రాట్నము, గాంధి, అస్పశ్యత, పంజాబువధలు, భారతమాత ఇత్యాదిశీర్షికలతో వీరు రచించిన పద్యములు తెలుగు చదువరులకు సుపరిచితములు. వీరి యాదర్శములకు దగినటులుగా మహాత్ముని యాత్మకథ మధురమైన కావ్యముగా సంతరించినారు. ఈరచన లిటులు సాగించుచునే దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల హైస్కూళ్లలో నాంధ్రోపాధ్యాయ పదవి నిర్వహించి శిష్యుల నెందఱనో దిద్దినారు. ప్రకృతము వీ రుపాధ్యాయ పదవియందే యున్నారు.

ఈయభినవ తిక్కననుగన్న తలిదండ్రులు ధన్యులు. చౌదరిగారితండ్రి నారయ్య ధర్మజ్యోతి. ఆయన శీలసంపద శాశ్వతమైన కృతిగా సంతరించి, యీపుత్రుడు మనకిచ్చెను. జనకునిపై తనయునకు గల భక్తిగౌరవములకేకాక, నీతి నిష్ఠావిశేషమునకు, రసభావ సౌష్ఠవములకుగూడ 'ధర్మజ్యోతి' తారకాణమైన కావ్యము. చౌదరిగారు తండ్రినిగూర్చి యిటులు వ్రాయుచున్నారు:

చదువక యున్ననేమి బుధనత్తము లుబ్బగ నర్థభానసం

పద వికసింప భాగవత భారతముల్ వివరించు; హృద్యముల్

తదమలకావ్యపద్యములు ధారణ కగ్గముచేసి వేనవేల్

చదువునతండు; తచ్చ్రవణసాహితి దుశ్శక మెట్టివారికిన్.

మక్కువమై కొండికనా

డక్కఱగల యడ్డు లేనియప్పుడు నొఱసౌ

చక్కట్ల దండ లాతడు

పెక్కులు మన్మృదుల హృదయపీఠిక జుట్టెన్.

సౌజన్యమూర్తియగు "తుమ్మల" కవికి 1948 లో, కనకాభిషేక గౌరవము జరిగిన సందర్భమున శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి యధ్యక్షుడుగా విప్పిన హృదయ మిట్లున్నది.