వాపముగాని, లేనిపుటపాకపు చీకటి జీవితంబు నె
ట్లోపితినోగదా, యవలియొ డ్డగుపింపని కాల మీదుచున్.
ఎన్నడు సోకునో తరగ లెత్తగ తెమ్మెర తావియూర్పునా
యన్నువమేన, ఎన్నడు దయారుణరాగ మనోజ్ఞతల్ జగా
వన్నె పసిండిపూత చెలువమ్ముల నాపయి గ్రుమ్మరించునో
యన్న నిరంతరాశ బ్రతుకాపిన దాగిరి గర్భవుం జెరన్.
' మాతల్లి ' కావ్యమునుండి మరిరెండు ఉదాహరింపకుండ నుండలేను.
ఆరనికోర్కెగా బ్రతుకునందు రగుల్కొనుచున్న దొక్కటే
కోరిక, నీకృపావనికి కోయిలనై సతమాలపింతు, మం
దార సుమారుణద్యుతి వితానముగొల్పెడి నీమనోహరా
కారమునన్ మధూదయ వికాసము నింపుము తల్లి, నాయెదన్.
ఏయను భూతిలేక రసమెండి, వివర్ణత దోగి వాసనల్
వోయిన నాహృదంబుజములో నొలికింపు మొకింత సర్వ సం
ధాయకమైన నీయడుగుదమ్ముల పుప్పొడి తోడితేనె; త
ల్లీ యదెచాలు నాకు ఫలియించును ప్రోవిడుకొన్న నాకలల్.
ఈ రచనలో భావస్ఫుటత, భాషాపటుత యెటులు వియ్యమందు చున్నవో చూచితిరి. ఎప్పుడో హరీంద్రనాథుడు ' దీపావళినాడు ' అను పద్యములకు దలయూపె నని చెప్పి, యిప్పుడు సత్యనారాయణ శాస్త్రిగారి రచనలు గొప్పగానుండునని బలవంతముగా మన మొప్పుకొన నక్కరలేదు. ఆయన కూర్పులో సాజముగా నట్టి లగువు బిగువు లున్నవి. అట్టి భావానానైశిత్య మున్నది. అట్టి శిల్పసంపత్తి యున్నది.