ఈ పుట ఆమోదించబడ్డది

వేదుల సత్యనారాయణ శాస్త్రి

1900

తల్లి: గురమ్మ. తండ్రి: కృష్ణయ్య. జన్మస్థానము: భద్రాచలము. జననము: వికారి సంవత్సర ఫాల్గుణ బహుళ షష్ఠీ బుధవారము. 22-3-1900. రచనలు: 1. దీపావళి 2. విముక్తి. 3. మాతల్లి 4. ఆరాధన 5. ముక్తావళి (కావ్యములు) మరికొన్ని నవలలు, నాటకములు, వ్యాసములు ఇత్యాదులు.

' వేదుల ' వారి పేరు తలపోయగనే ' దీపావళి ' స్మరనకు దగులును. దీనికి గారణము కవితన్మయుడై రచించిన కావ్యకదంబమా కూర్పులో నుండవలయును. నిజమే.

శ్రీ సత్యనారాయణ శాస్త్రిగారు సంస్కృతాంధ్రములలో జక్కని సాహిత్య సంపత్తిగలవారు. గురుకుల వాసముచేసి గొట్టుపుళ్ల శ్రీనివాసాచార్యులవారికడ కావ్యనాటకాలంకారములు పఠించిరి. చిలుకూరి సోమనాధశాస్త్రిగారి సన్నిధానమున వ్యాకరణాధ్యయనము సాగించిరి. చల్లా వేంకట నరసయ్యగారి దగ్గర స్మార్తము కూడ పాఠము చేసిరి. కవితాగురువులు కవిసార్వభౌమ శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రులవారు. దివ్యమైన యీగురుత్వ భాగ్యముతో " వేదుల " వారు సంగ్రహించిన వైదుష్యము ప్రశంసనీయమైనది కదా ! విద్వత్పట్టభద్రులైన శాస్త్రిగారు కాకినాడ, పెద్దాపురము, పేరూరు హైస్కూళ్లలో నిరువది నాలుగేండ్లుగా నాంధ్రోపాధ్యాయ పదవి నిర్వహించుచున్నారు పెక్కురు జమీందారులు వీరిని గౌరవించి వార్షికబహుమానము లిచ్చుచున్నారు. వీరు శతావధానులు. కాని, దేశకాలస్థితులు గుర్తించిన లోకజ్జతవిరియందుండి, ఆగారడీ పనులను కట్టిపెట్టించినది.