ఈ పుట ఆమోదించబడ్డది

భమిడిపాటి కామేశ్వరరావు

1897

వెలనాటి శాఖీయ బ్రాహ్మణుడు. తల్లి: లచ్చమ్మ. తండ్రి: నరసావధానులు. జన్మస్థానము: ఆకివీడు. నివాసము: రాజమహేంద్రవరము. జననము: 30 ఏప్రిలు 1897. రచనలు: 1. కాలక్షేపం 2. ఇప్పుడు 3. అవును 4. నిజం 5. అప్పుడు 6. మాటవరస 7. గుసగుసపెళ్లి 8. పెళ్లిట్రయినింగు. 9. రెండురెళ్లు. 10. అన్నీ తగాదాలే. 11. మేజువాణి. 12. మన తెలుగు. 13. కాలక్షేపం (2 భాగాలు) 14. లోకోభిన్నరుచిః. 15. తనలో. 16. మాయలమాలోకం. 17. చెప్పలేం. 18. మృచ్ఛకటిక. 19. ముద్రారాక్షసం. 20. ప్రణయరంగం. 21. త్యాగరాజు ఆత్మవిచారం- ఇత్యాదులు.

ఈనాటి హాస్యరచయితలలో శ్రీభమిడిపాటి కామేశ్వరరావు గారి స్థానము ప్రత్యేకము విశిష్టము నైనది. బాగుబాగు-ఎప్పుడూ ఇంతే-కచట తవలు-తప్పనిసరి-వద్దంటే పెళ్లి-ఘటన-ఈ మొదలయిన ప్రదర్శనాల సంవిధానముతో వేఱుచేయలేని కామేశ్వరరావుగారి పేరు యువ ప్రపంచమున నిత్యవిహారము కలది. ముఖ్యముగా, కళాశాలలలో వీరి నాటికలు ప్రాయికముగా ప్రదర్శితము లగుచుండుట గమనింపదగినది. విద్యార్థుల హృదయములు కృతకసంసార దూషితములు కానివి; పరమస్వచ్ఛములైన వారి యాత్మ లానందమయములు. కనుకనే తత్త్వావధారణమునకు దారి చూపు హాస్యరసముపైనే వారికి జూపు. సంసారబంధితుడు తఱచుగా నవ్వలేని కుటిలుడు. సత్యమును సత్యముగా గుఱుతింపలేకపోవుట హాస్యమునకు గారణమగుచున్నది. ఈగుఱుతుగల సంసారులు అరుదుగానుందురు. అనగా తత్త్వనిర్ధారణమునకు చర్చా గ్రంథమైన హాస్యరసము నాస్వాదించుటకు సంయతాత్ముడే అధికారియగుచున్నాడు. బ్రతుకును పొడిగించుకొన దలచినవారికి నృత్య-హాస్యముల యక్కఱ మిక్కిలి కావలసియుండును. కాబట్టి హాస్యము