511
ముగా గుర్తింపగలరు. మానసిక తత్త్వము క్షణములో దెలిసికొన గలరు. ఈ విశిష్టలక్షణములతో బాపిరాజుగారు పెద్దపెద్ద నవలను వ్రాసిరి. పుటలు పెంచుటయే పరమార్థముగా భావించినవారు గాక, రసఘటములుగా వీరు నవలలు తీర్చినారు. విషయము వచ్చినపుడు దానిని ఆమూలచూడము ప్రత్యక్షముచేయుట వీరి కలవాటు. సగము సగము, తెలిసీతెలియని యెరుకతో గొలుకుట కాయన యిష్టపడరు. ధర్మము-శిల్పము-కవిత్వము-ప్రేమ-సంగీతము-మొదలయిన వానిపై ఆయన తన నవలలలో సందర్భము ననుసరించి కావించిన విశాల చర్చలు ప్రత్యేకగ్రంథములు కాగలయవి. 'హిమబిందు ' లో నెన్నో ప్రకరణములు బాపిరాజుగారికి పురాతన శాస్త్రములలో గల ప్రగాఢ ప్రవేశమును తార్కాణించుచున్నవి. ఆంధ్ర చరిత్రయు, బౌద్ధయుగ చరిత్రయు, లెస్సగా బరిశ్రమించి యాకళించినవా రగుటచే వీరి నవలలు చాలభాగము చారిత్రకములై యున్నవి. చరిత్రలో నిట్టి కృషిచేసిన నవలా రచయితను వేరొకని మనము చూడము.
ఇట్టి బాపురాజుగారి కళాజీవితము చైత్రరథము. ఆయన నిత్యమందహాసి. ఆయన న్యాయవాదిగా నుండదగిన చదువు బి. యల్. చదివెను. భీమవరములో నొకయేడు ' బల్ల ' కట్టెను గాని, హృదయ మొప్పుకొనక, బందరు ఆంధ్రజాతీయకళాశాలలో ప్రిన్సిపాలు పదవిలో బ్రవేశించెను. ఇది 1935 మొదలు నాలుగేండ్లు సాగినది. అక్కడనుండి చెన్నపురి జీవనము కొన్నాళ్లు. చలన చిత్రములు కొన్నింట చిత్రకళా దర్శకత్వము నిర్వహించెను. అనసూయ - ధ్రువవిజయము ఇత్యాదులు - 1942 వ సంవత్సరములో నివన్నియు మాని హైదరాబాదున ప్రచురిత మగుచున్న ' మీజాను ' పత్రికకు సంపాదకత్వము నెరపుటకై వెళ్లిరి. అది 42 సం|| వరకు నిర్వహించిరి. ఇది యిటు లుండగా, బందరు, భీమవరము, హైదరాబాదు, మదరాసు మున్నగు ప్రసిద్ధస్థలము