ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టి శయ్యాసౌష్ఠవము తఱచుగా నేడు మనముచూడజాలము. విజాతీయ పదములకు మాఱిపోని తెలుగుముద్రవేసినకవి జాషువయే. ఆయన ఖండకృతులలో దొలుత మంచిపేరువడ్డది "పిరదౌసి". దానివెనుక జాలకృతులాయన వెలువరింవ్హెను. ఇవియెల్ల 'పిరదౌసి' కావ్యమునకు ఆమ్రేడితములు. గబ్బిలము-అనసూయ మున్నగు వీరిరచనలు వ్యథాభరితమైన హృదయమునుండి పొంగి వచ్చినవిగా దోచును. ఈయన కెంత యుత్సాహోద్రేకము లున్నవో, అంత యావేదనమున్నది. ఆవేదనమునుండి సముత్పన్నమగు కవిత రసార్ద్రమైయుండి రసిక మానసములు కరగించుటకు సమర్థమగును. కర్ణుని గూర్చి ఆయన రచించిన పద్యములు గొప్పవి. శ్రుతిసుఖమైన జాషువకవి కోకిలము కవిత్వ గానము విద్యార్థులు, విద్వాంసులు, పామరులు ధీమంతులు కూడ విని తనియుటకు దగినది. అన్వయములో పెళుసుతనము, పదముద్రలో బిరుసుదనము లేక కమ్మెచ్చున దీసినటులు నడచు వీరి కవితాశైలి తెలుగువారి పారాయణముగా జాలువాఱుచున్నది.

జాషువకవి యుభయభాషాప్రవీణ బిరుద విభ్రాజితుడు. 1919 నుండి గుంటూరు ట్రెనింగుస్కూలులో 1928 వఱకు నుద్యోగించెను. తరువాత, 29 సం.15 సంవత్సరములు గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలలో తెలుగుపండితపదవి. 42 సం. నుండి మూడు వత్సరములు మదరాసున యుద్ధవిషయికమైన ప్రచారశాఖలో పాటలువ్రాయుచు, ఉపన్యాసములిచ్చుచు: గడపెను. 47 నుండి యుద్యోగ విరమణము. ఈవిశ్రాంతిలో నెన్నో కావ్యములు రచించుటకు వీరు సమర్థులు.

కావ్యరచనోద్యోగము ముందు, ఈ యుద్యోగములన్నియు లెక్కలేనివి. ఆయన ఆధునిక కవులలో జెఱిగిపోని తఱిగిపోని యశస్సునమార్జించుకొన్న కవి. గండపెండరములు తొడిగి, ఏనుగు నెక్కించి, కనకాభిషేకముచేసి, సహస్రద్రవ్యములు కానుకనిచ్చి, తెలుగునేల జాషువకవిగారిని గౌరవించుచున్నది. ఈ గౌరవములకు వారికావ్యములు దోయిలించుచున్నవి.