పరవస్తు వేంకట రంగాచార్యులు
1822 - 1900
జననము: 1822 సం. నిర్యాణము: 1900 సం. నివాసస్థానము: విశాఖపట్టణము. తండ్రి: శ్రీనివాసాచార్యులు. గ్రంథములు: 1. మంజుల నైషధము (ఏడంకముల నాటకము). 2. లఘువ్యాకరణము (శ్లోకరూపమగు సులభ వ్యాకరణము) 3. ప్రపత్తివాదము (వేదాంత గ్రంథము) 4. కుంభకర్ణ విజయము 5. ఆంగ్లాధిరాజ్యస్వాగతము (చిన్న కావ్యములు) 6. శకుంతలము (ఆంధ్రీకరణము) 7. కమలినీ కలహంసము (రాజచూడామణి దీక్షితుని కృతి కాంధ్ర పరివర్తనము) 8. శబ్దార్థ సర్వస్వము (నిఘంటువు) 9. ఈళ, కేన, ప్రశ్న, ముండ, మాండు క్యాది దశోపనిషత్తులకు బద్యానువాదము. మున్నగునవి.
మన ప్రాచీనకవి పండితుల నిరంకుశతకు గుఱుతులుగా ననేక చరితములు చెప్పుకొందురు. పిఠాపురసంస్థాన ప్రభువగు గంగాధరరామారావుగారు గొప్ప రసిక ప్రభువులనియు, వారియాస్థానిలో బులుసు పాపయ్య శాస్త్రి ప్రభృతులు పండితులుగా నుండి చేసిన నిరంకుశవాదములు స్మరణీయము లనియు నేడు కథలుగా, గాథలుగా నల్లుకొన్నవి. విజయనగర సంస్థానములో కలిగొట్టు కామరాజుగారని గొప్ప గాయకుడు. ఆయన పల్లవిపాటలో జోడులేనివాడు. మహారాజు బతిమాలినను, దనకు దోచినపుడుగాని గొంతెత్తువాడు కాదట.
మహామహోపాధ్యాయులగు పరవస్తు రంగాచార్యుల వారిని దర్శింప వలయునని విజయనగర సంస్థాన ప్రభువు నభిలాష. ఎన్నో సారులు వర్తమానము లంపిరి. చివరకు రంగాచార్యులవారు మూడు నియమముల కడ్డు చెప్పనిచో వచ్చుట కభ్యంతరము లేదని కబురు చేసిరి. 1.సవారిలో కోటగుమ్మమువరకు వెళ్ళుట (2) కోటగుమ్మముకడ సవారి దిగి పాదుకలతో సభామండపముదాక వెళ్ళుట.